ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడప్పుడే క్రికెట్ సాధ్యంకాదని అన్ని బోర్డులు ఒక అంచనాకు వచ్చేశాయి. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అక్టోబరులో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌పైనా ఆశలు వదులుకున్నాయి. అయితే ప్రపంచకప్ కంటే ఐపీఎల్ జరగకపోతేనే తమకు ఎక్కువ నష్టమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి రూ.4000 కోట్లు నష్టమని అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. భారత్‌లో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో బీసీసీఐ కూడా ఏం చేయలేని పరిస్థితి! తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతినివ్వడంతో ఐపీఎల్ నిర్వహణపై ఆశలు చిగురించాయి. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు బోర్డు పెద్దలు ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షా కాలం కావడంతో అంతరాయం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదు. సుమారు రెండు నెలలు సాగే ఐపీఎల్‌ను ఈ ఏడాదే ముగించాలంటే అక్టోబరు- నవంబరు సరైన సమయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. పొట్టి కప్పు భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచకప్ వాయిదా పడితే అక్టోబరు- నవంబరులో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని బీసీసీఐ, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. మార్చి నెల నుంచి క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో నేరుగా ప్రపంచకప్ ఆడటం కూడా సరికాదని కొందరు ఆటగాళ్లు భావిస్తున్నారు. పొట్టి కప్‌కు ముందు ఐపీఎల్ నిర్వహిస్తే మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అక్టోబరులో ఐపీఎల్.. డిసెంబరులో టీ20 కప్ నిర్వహిస్తే క్రికెట్ మళ్లీ గాడిన పడుతుందని భావిస్తున్నారు.
ఖాళీ స్టేడియాల్లో IPL జరగవచ్చు
Related tags :