ScienceAndTech

మాస్కు తీయకుండా భోజనం చేయవచ్చు

Now you can eat without taking off your mask

కరోనా వైరస్ కారణంగా మాస్క్‌ ధరించడం తప్పనిసరైపోయింది. తినాలన్నా, తాగాలన్నా దాన్ని తీయాల్సిందే. అయితే ఇకనుంచి ఆ ఇబ్బంది లేకుండా మాస్క్‌ ధరించి కూడా హాయిగా తినేయొచ్చని చెప్తున్నారు ఇజ్రాయెల్ దేశానికి చెందిన తయారీదారులు. చేతిలోఉన్న హ్యాండ్ రిమోట్‌ను నొక్కగానే మాస్క్‌కు ఉన్న స్లాట్ తెరుచుకుంటుంది. దాంతో మాస్క్‌ తీయకుండానే కావాల్సిన ఆహారం ఎంచక్కా లాగించేయొచ్చని వారు చెప్తున్నారు. ‘మాస్క్‌ను హ్యాండ్ రిమోట్‌తో తెరుచుకొనేలా చేయడం, లేకపోతే ఫోర్క్‌ను నోటి వద్దకు తీసుకురాగానే ఆటోమెటిగ్గా మాస్క్‌ స్లాట్ తెరుచుకోవడం దీని ప్రత్యేకత. ఆరగించడం అయ్యాక నోటి దగ్గరి నుంచి ఫోర్క్ తీసివేయగానే మాస్క్ మూసుకుంటుంది. అలాగే మీ చుట్టుపక్కల కూర్చున్నవారి నుంచి వైరస్‌ సోకకుండా రక్షణ లభిస్తుంది’ అని తయారీసంస్థ ఎవిటిపస్ పేటెంట్స్‌, ఇన్వెన్షన్స్‌ సహాధ్యక్షుడు అసఫ్ గిటెలిస్‌ వెల్లడించారు. ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దీని ధర రూ.60 నుంచి 200 వరకు ఉండొచ్చన్నారు. అయితే మాస్క్ పనితీరుపై అక్కడి ప్రజలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఐస్‌క్రీం వంటివి తినడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఇజ్రాయెల్‌లో కరోనా వైరస్‌ అదుపులో ఉండటంతో లాక్‌డౌన్ నుంచి ఆ దేశం దాదాపుగా బయటకువచ్చింది.