Movies

మధురగాయనీ లీల జయంతి నేడు

Remembering the legacy of veteran singer porayatthu leela

పొరయత్తు లీల (మే 19, 1934 – అక్టోబరు 31, 2005) ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని

సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 50 యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే అనిచెప్పకతప్పదు. అలా పాతతరంనాటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్టచేసి నేటికి పాడుకునేలా చేయగలిగిన గాయనీమణుల్లో పి.లీల ఒకరు.

దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషచిత్రాల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. అలాగే బెంగాలీ, సింహాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కేవలం సినీపాటలే కాదు భక్తిగీతా లను సైతం అద్బుతంగా ఆలపించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతసరస్వతులు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, ఎం.ఎల్‌. వసంతకుమారి, డి.కె. పట్టామ్మాళ్‌ వంటి వారి సమకాలీకురాలు కావడం ఆమెకు సంగీతంపై మక్కువకు కారణంకావచ్చునేమో. కేరళ, పాలక్కడ్‌ లోని చిట్టూర్‌లో 1934 సంవత్సరంలో పుట్టారు పొరయాతు లీల.లీలతో పాటు ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. తల్లితండ్రులు సంగీతప్రియులు కావడంతో లీలకు స్వతహాగానే సంగీతంపై మక్కువ ఏర్పడటం గమనించి ఆమెకు కర్నాటక సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు. ఆమె గొంతు కొద్దిగా లావుగా ధ్వనించేదని విమర్శించినా అదే పాటకు నిండుదనం తెచ్చిందని చెప్పాలి. అద్భుతమైన గాత్రం ఆమెకు ఓ వరం. ఎందరో ప్రముఖ విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు. మరింత సాధనకోసం, సంగీతం కోసం మద్రాసు చేరింది లీల కుటుంబం. మద్రాసులో ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా సంగీతంలో మరింతగా రాణించి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు.

ఈ సందర్భంలో కొలంబియా రికార్డింగ్‌ కంపెనీవారు తాము విడుదల చేసే పాటలకు పాటలు పాడే గాయనీ కోసం వెతుకుతుండగా లీలగారి గురించి తెలిసి ఆమెను గాయనిగా ఎంచుకున్నారు. అది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గమయిందని చెప్పొచ్చు. అయితే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో పట్టులేని కారణంగా కీర్తనలను మళయాళంలో రాసుకుని సాధనచేసి పాడేవారట. ఆ తర్వాత ట్యూటర్‌ను నియమించుకుని భాషపై పట్టును సాధించారు. గాయనీగాయకులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం భాషపై పట్టు సాధించడం. ఇది నేటితరం గాయనీ గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.1948 సంవత్సరంలో తొలిసారిగా తమిళంలో పాడిన పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరోయిన్‌కు అన్నిపాటలు ఆవిడే పాడారు. అలా తమిళంలో పాడుతూ, 1949 సంవత్సరం తెలుగులో పాడే అద్భుత అవకాశం వచ్చింది. నాగయ్యగారు నటించిన మనదేశం చిత్రంలో ఘంటసాలమాస్టారి సంగీతదర్శకత్వంలో పి.లీలను తొలిసారిగా తెలుగువారికి గాయనిగా పరిచయం చేస్తూ అందులో పాటలు పాడించారు. ఆ చిత్రం ద్వారానే ఆంధ్రుల ఆరాధ్యనటుడు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. పరిచయమయ్యారు. ఆ యేడాది విడుదలైన మనదేశం, కీలుగుర్రం, గుణ సుందరికథ చిత్రాల్లో ఆమె పాటలు పాడగా ఆ మూడు చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించి ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టడమే కాదు తెలుగులో గాయనిగా స్థిరపడ్డారు. అంతేకాదు వాహిని, విజయా సంస్థలు నిర్మించే చిత్రాల ఆస్థానగాయనిగా పేరుపడ్డారావిడ. ఆ తర్వాత మిస్సమ్మ, షావుకారు, పాతాళభైరవి, సువర్ణ సుందరి, పెళ్ళినాటి ప్రమాణాలు, శాంతినివాసం, చిరంజీవులు, బాలనాగమ్మ, మాయాబజార్‌, జగదేకవీరునికథ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు సంపూర్ణరామాయణం, బభ్రువాహన, తిరుపతమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, శ్రీసీతారామకళ్యాణం, దీపావళి, శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం, పెళ్ళి సందడి, పాండురంగ మహాత్మ్యం, సారంగధర, భలేరాముడు, జయం మనదే, పరమానందయ్య శిష్యులకథ, నవ్వితే నవరత్నాలు, పల్లెటూరు, అనార్కలి వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడారు. సుశీల, జిక్కి, వంటి గాయనీమణులతో కూడా కలిసి ఎన్నో చక్కని గీతాలను కూడా ఆలపించారు. కేవలం సినీ గీతాలే కాకుండా ప్రైవేటుగా భక్తిగీతాలు, శ్లోకాలు, పద్యాలు కూడా పాడారు. లవకుశ చిత్రంలో ఆమె పాడిన పాటలు నేటికీ సినీప్రియులు పాడుకుంటూనే ఉంటారు. భావప్రధానంగా, రాగయుక్తగా పాడటం ఆమెకే చెల్లు. ఉత్తమగాయనిగా ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ఆమె పాడిన పాటల్లో గుణసుందరికథలో ‘శ్రీ తులసి జయతులసి జయమునియ్యవే..’, బ్రతుకుతెరువు చిత్రంలో ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.’ జయసింహ చిత్రంలో ‘ఈనాటి ఈరేయి కలకాదోరు నిజమోరు,’ మిస్సమ్మ చిత్రంలో ‘కరుణించుమేరిమాత,’ ‘తెలుసుకొనవే యువతి’, ‘యేమిటో ఈ మాయ, చల్లనిరాజా వెన్నెల రాజా’, వంటి పాటలు, చిరంజీవులు చిత్రంలో ‘తెల్లవారగ వచ్చే తెలియక నాస్వామి మళ్ళీ పరుండేవు లేరా’, మాయాబజార్‌ చిత్రంలో ‘చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ,’ ‘విన్నావా యశోదమ్మ’, జగదేకవీరుని కథలో ‘నను దయగనవా నా మొరవినవా..’, లవకుశ చిత్రంలోసుశీలగారితో ‘రామకథను వినరయ్య,’ ఊరకే కన్నీరు నింప,’, ‘వినుడు వినుడు రామాయణగాథ, ‘ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ’ వంటి పాటలు కలిసి పాడారు. పాండవవనవాసం చిత్రంలో ‘దేవా దీనబాంధవా’, రహస్యం చిత్రంలో ‘శ్రీలలిత శివజ్యోతి సర్వకామద’ గీతాలాలపించారు. హుషారు, విషాదం, భక్తి ఇలా అన్నిరకాల పాటలు పాడారు. ‘చిన్నారిపాపలు’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణభారతదేశంలో అద్భుత పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన గాయనీ మణుల్లో ప్రముఖురాలిగా సినీ ప్రియులచే అభిమానించబడిన పి.లీల 2005 అక్టోబరులో చెన్నైలో మరణించారు. ఆమె మరణించినా ఆమె పాడిన పాటలు సినీ ప్రియుల మదిలో సజీవమై ఉన్నంతకాలం ఆమె పాటలరూపంలో బ్రతికే ఉంటారు.