కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడానికి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు, హృద్రోగ వైద్య నిపుణులు, ప్రముఖ దాత, కాలిఫోర్నియాలోని మెర్సద్ నివాసి అయిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి అరుదైన గౌరవం అందుకోనున్నారు. మెర్సద్ నగరంలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు డా.హనిమిరెడ్డి చేసిన సేవ, అందించిన సహకారానికి గుర్తింపుగా ఆ విశ్వవిద్యాలయ అత్యున్నత గౌరవం అయిన ఛాన్సెలర్స్ మెడల్‌ను ఆయనకు ప్రదానం చేసేందుకు నిర్ణయించినట్లు UC Merced ఛాన్సెలర్ నేథెన్ బ్రాస్ట్రమ్ హనిమిరెడ్డికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. సోదాహరణీయమైన బాధ్యత, అలుపెరుగని నిబద్ధత, చిరంతనమైన సేవతో విశ్వవిద్యాలయ ప్రమాణాలను ప్రభావితం చేసేవారికి మాత్రమే ఈ పురస్కారాన్ని అందజేస్తామని, అటువంటి పురస్కారాన్ని డా.హనిమిరెడ్డికి అందజేయడం తమకు లభించిన గౌరవంగా భావిస్తామని నేథన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో విలయతాండవం చేస్తున్న కరోనా తగ్గుముఖం పట్టాక విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందజేస్తామని ఛాన్సెలర్ తెలిపారు. UC Merced ఏర్పాటుకు, విస్తరణకు హనిమిరెడ్డి రెండు మిలియన్ డాలర్లకు(₹15.4కోట్లు) పైగా విరాళాన్ని అందజేశారు. దీనితో పాటు ప్రతి ఏడాది ఆ యూనివర్శిటీలో విద్యనభ్యసించే పలువురు విద్యార్థులకు ఉపకారవేతనాలను సైతం ఆయన అందజేస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయన్ను ఈ పురస్కారం వరించింది.
డా.లకిరెడ్డి హనిమిరెడ్డికి అరుదైన గౌరవం
Related tags :