Politics

గాంధీని కించపరిచినందుకు నాగబాబుపై కేసు

Police Case Filed On Nagababu For Comments On Gandhi

జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. నాగబాబుపై ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం మానవతారాయ్‌ మాట్లాడుతూ.. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలన్నారు. మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్‌లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని విమర్శించారు. నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, మంగళవారం గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు వివాదస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలసిందే. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్‌. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్‌ సోల్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ నాగబాబు ట్వీట్‌ చేశారు.