DailyDose

పోతిరెడ్డిపాడుపై కోర్టు స్టే-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Court Stays Pothireddipadu Construction

* విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఎల్జీ పాలిమర్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కూ గ్వాంగ్‌ మో క్షమాపణ చెప్పారు. సియోల్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు గ్యాస్‌ లీకేజీ ఘటనపై స్పందించారు. గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఎంతో బాధ కలిగించాయని ఆయన అన్నారు. విశాఖలో జరిగిన ఘటనతో పాటు, దక్షిణ కొరియాలోని కెమికల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలపై సంతాపం వ్యక్తం చేసిన కూ గ్వాంగ్‌ మో.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాలకు సంబంధించి సంస్థ పూర్తి బాధ్యత తీసుకుటుందని ఆయన స్పష్టం చేశారు.

* కొవిడ్‌-19 ఉద్దీపన పథకంలో పేదలు, వలస కార్మికులు, బలహీన వర్గాలకు సహాయం లభించలేదన్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొట్టిపారేశారు. నేరుగా నగదు అందించడమే సమస్యకు ఏకైక పరిష్కారం కాదని నొక్కిచెప్పారు. న్యూస్‌18కు ఇచ్చిన ముఖాముఖిలో వలస కార్మికుల కష్టాలు సహా కీలక అంశాలపై ఆమె మాట్లాడారు. ఉద్దీపన పథకం ద్వారా ప్రజలకు నేరుగా నగదు అందించాలన్న ఆర్థికవేత్తలు, పరిశీలకుల వాదనలను తాము విన్నామని సీతారామన్‌ అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ దారిలోనే నడవాలని నిర్ణయించుకుందన్నారు. సంస్థలకు నగదు లభ్యత (లిక్విడిటీ) కల్పించడం ద్వారా పర్యవసాన ప్రభావం (క్యాస్‌కేడింగ్‌ ఎఫెక్ట్‌) కనిపిస్తుందన్నారు. ఫలితంగా ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు జీవనం సాగించేందుకు నగదు బదిలీ చేయడం, అదనంగా తిండిగింజలు, ఆహార పదార్థాలు అందించేందుకు మొదటి పరిహార పథకం అమలు చేశామని తెలిపారు. రెండో ఉద్దీపన పథకం మరింత సమగ్రంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.

* గుంటూరు సంపత్‌నగర్‌లో గుడిసెలో ఉండే వ్యక్తికి రెండు నెలల్లో రూ.3వేల కరెంటు బిల్లు వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచి పేద ప్రజలు విద్యుత్‌ వాడుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రూ.వేలల్లో వచ్చిన బిల్లులు చూసి ప్రజలు షాక్‌కు గురవుతున్నారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్‌ కొరతను అధిగమించి.. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలల పాటు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

* రాష్ట్రంలోని రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆంధ్రా గ్రీన్స్‌(andhragreens.com) వెబ్‌సైట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా రైతుల ఉత్పత్తుల విక్రయాలకు ఇబ్బంది కలిగిందని.. ఈ సమస్యను పరిష్కరించాలనే ఈ తరహా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆంధ్రా గ్రీన్స్‌ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మాణాలను నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్టే విధించింది. ఈ మేరకు ఎన్‌జీటీ దక్షిణాది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడుపై చేపడుతున్న నిర్మాణాలపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద నిర్మాణాలు చేపడితే పర్యావరణంపై పడే ప్రభావంపై పరిశీలన చేసేందుకు 4 శాఖల సభ్యులతో కమిటీ నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఎన్‌జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్‌జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

* పోతిరెడ్డిపాడుపై కుట్రపూరితంగా ప్రజలను మోసం చేసేందుకు యత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల ఎత్తిపోతకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. భావితరాల జీవితాలు తాకట్టు పెట్టి పథకం చేపడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి షెకావత్‌తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ ఎండిపోతుందని.. హైదరాబాద్‌కు మంచి నీటి సమస్య వస్తుందన్నారు.