ScienceAndTech

ఫేస్‌బుక్ నుండి నూతన భద్రత సాంకేతికత

Facebook brings new security feature

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ యూజర్ల ప్రొఫైల్‌ భద్రతకు సంబంధించి సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు తమ వ్యక్తిగత వివరాలను చూడకుండా యూజర్లు తమ ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. రాబోయే రెండు వారాల్లో ఈ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ వెల్లడించింది. ‘‘ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు మీ గురించి తెలుకునేందుకు అవకాశం ఉండదు. దీని వల్ల మీ వ్యక్తిగత వివరాలకు మరింత భద్రత లభించినట్లవుతుంది. అంతేకాకుండా మీ ప్రొఫైల్‌, కవర్‌ ఫొటోలు డౌన్‌లోడ్ చేయడం, వాటిని షేర్‌ చేయడం, మీ ఖాతాలో ఉన్న ఫొటోలను చూడడం, మీ టైమ్‌లైన్‌లో పోస్టింగ్‌లు చేయడం వంటివి చేయలేరు. ఒక్కసారి మీ ప్రొఫైల్‌ లాక్‌ అయితే, ప్రొఫైల్ లాక్డ్ అనే ట్యాగ్ కనిపిస్తుంది’’ అని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో మీ పేరు కింద మోర్‌ అనే ఆప్షపై క్లిక్‌ చేస్తే ‘లాక్‌ ప్రొఫైల్‌’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్‌ చేసి.. కన్ఫర్మ్‌ చేసేందుకు మరోసారి క్లిక్‌ చేస్తే మీ ప్రొఫైల్‌ లాక్‌ అవుతుంది. ఒక వేళ మీరు తిరిగి మీ ప్రొఫైల్‌ను అన్‌లాక్‌ చేయాలంటే ‘యువర్‌ ప్రొఫైల్ ఈజ్‌ లాక్డ్’ పై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ అనే ఆప్షన్ సెలెక్ట్‌ చేస్తే సరిపోతుంది. ‘‘వినియోదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఫేస్‌బుక్ కట్టుబడి ఉంది. భారత్‌లో ఎక్కువ మంది, ముఖ్యంగా మహిళలు ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత మెరుగుపరుస్తాం’’ అని ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖి దాస్‌ తెలిపారు.