దేశీయ విమానయాన సేవలు ఈ నెల 25 నుంచి దశలవారీగా ప్రారంభమవనున్న నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ప్రయాణికుల ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ కచ్చితంగా ఉండాలని, ఎయిర్ పోర్టులోకి వెళ్లేప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేస్తూ.. పలు సూచనలను ప్రస్తావించింది.
****విమానాశ్రయం వద్ద తప్పక పాటించాల్సినవి:
* ప్రయాణికులందరికీ విమానాశ్రయ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. 14 ఏళ్ల లోపు పిల్లలకు మినహా మిగతా వారందరి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. ఆ యాప్‌లో గ్రీన్ కలర్ చూపించకపోయినా, అసలు ఫోన్‌లో యాప్ లేకపోయినా వారికి లోపలికి అనుమతి ఉండదు.
* ప్రయాణికులు నిర్దేశించిన సమయానికి కంటే రెండు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలి. విమాన సమయానికి నాలుగు గంటల ముందు మాత్రమే టెర్మినల్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
* విమానయాన సిబ్బంది, ప్రయాణికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, యంత్రాంగమే ప్రైవేటు ట్యాక్సీలు, ఇతర రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
* విమానాశ్రయం నుంచి సిబ్బంది, ప్రయాణికుల రాకపోకలకు వ్యక్తిగత వాహనాలు, ఎంచుకున్న క్యాబ్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* ప్రయాణికులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసే ప్రకటనలు చేయాలి.
* కూర్చునే ప్రాంతాల్లో భౌతిక దూరం నిమిత్తం సీట్ల మీద మార్కింగ్ తప్పనిసరి.
* హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా శానిటైజర్లు, వ్యక్తిగత రక్షణ తొడుగులు సిబ్బంది వద్ద ఉండాలి.
* ప్రత్యేక సందర్భాల్లో మినహా రాకపోకల సెక్షన్ల వద్దకు ట్రాలీలకు అనుమతి లేదు. ఒకవేళ వాటి అవసరం వస్తే తప్పకుండా శానిటైజ్ చేయాలి.
* నిర్వాహకులు ప్రవేశానికి ముందు బ్యాగులు శానిటైజ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి.
* రద్దీ నివారణకు టెర్మినల్ అన్ని ద్వారాలు తెరిచి ఉంచాలి.
* మ్యాట్లు, కార్పెట్లను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తి స్థాయిలో శుభ్రపరచాలి.
* ప్రయాణికులకు అనువుగా ఉండేలా టికెట్ తనిఖీ ప్రదేశాలు, భద్రతా తనిఖీ, చెక్‌ఇన్ కౌంటర్లు వంటి వాటి చోట గాజు క్యాబిన్లు ఏర్పాటు చేయాలి. లేదా అక్కడ ఉండే సిబ్బందికి ఫేస్ షీల్డ్‌లు అందుబాటులో ఉంచాలి.
* జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న సిబ్బంది విధులకు దూరంగా ఉండాలి. అలాగే సిబ్బంది ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చూడాలి.
*ఒకవేళ టెర్మినల్‌లో కరోనా సోకిన రోగిని గుర్తిస్తే..వెంటనే ఆ ప్రాంతాన్ని క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలి. తగిన జాగ్రత్తలతో రోగిని నిర్దేశిత ప్రాంతానికి తరలించాలి.
* గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
* విమానయాన సంస్థలు విమానంలో ఎలాంటి ఆహార పదార్థాలూ సరఫరా చేయకూడదు. విమానంలో తినేందుకు ప్రయాణికులకు అనుమతి లేదు.
* కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న వారిని ప్రయాణాలకు అనుమతించకూడదు.
* విమానంలోని మరుగుదొడ్లను ప్రయాణికులు వీలైనంత వరకు వాడకపోవడం మంచిది.
విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాలి
Related tags :