భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను నేపాల్ తనవిగా చెప్పుకుంటున్న మ్యాప్‌ను బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సమర్థించారు. దాంతో నెటిజన్లు ఆమె మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్ మంత్రిమండలి కొత్త మ్యాప్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు రోజుల క్రితం మనీషా ట్విటర్ వేదికగా స్పందిస్తూ, తన దేశానికి మద్దతు పలికారు. ‘మన చిన్న దేశాన్ని గౌరవంగా ఉంచినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతమైన, గౌరవపూర్వకమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇది ఆమె అభిమానులు, భారతీయుల ఆగ్రహానికి కారణమైంది.
> మీరు అప్పటి మనీషాలా లేరు. మీరు భారత్‌ను విడిచివెళ్తే మంచిది. ఆ మూడు ప్రాంతాలు భారత్‌లోనివే. నేను కూడా నేపాల్‌కు చెందిన వ్యక్తినే. నేను ఎప్పుడూ భారత్‌కే మద్దతు ఇస్తాను.
> నేపాల్ గౌరవం ఎప్పుడూ భారత్‌తో ముడిపడి ఉంటుంది. కొందరు మావోయిస్టులు అధికారంలోకి వచ్చే వరకు భారత్, నేపాల్ మధ్య మంచి సంబంధాలున్నాయి. వారు అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చైనా చెప్పినట్లు ఆడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఎంతో పొందిన మీ లాంటి వారు నేపాల్ గౌరవాన్ని భారత్ భంగపరిచినట్లు మాట్లాడుతున్నారు.
> మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఎప్పటి నుంచో నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని భారతీయ నటిగానే భావిస్తాను. నేపాల్ విషయంలో భారత్ ఎప్పుడు దురుసుగా ప్రవర్తించింది? కాలాపానీ ప్రాంతం గురించి మొదటిసారి నేపాల్ మాట్లాడటం వింటున్నాను.
> వెళ్లి మీ దేశ సినిమా పరిశ్రమలో సంపాదించుకోండి.. అంటూ ట్వీట్లు చేశారు. ఇదిలా ఉండగా, నేపాల్ వాదనలను భారత్ కొట్టిపారేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాల్లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.