Movies

ఆ కలం…కదన కుతూహలం…కవన విప్లవావాలం

A Tribute To Veteran Legendary Lyricist And Poet Veturi On His Death Anniversary

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 – మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.

1936 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. మద్రాస్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన వేటూరి ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా 1956 నుంచి సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు. సాహిత్యాభిలాషతో వేటూరి ఆకాశవాణి కోసం కొన్ని గేయ నాటికలు రాసారు. అందులో ఆయనకీ బాగా పేరు తెచ్చినది… సిరికాకుళం చిన్నది…. అన్న గేయ నాటిక. కళాతపస్వి కె.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ చిత్రం వేటూరికి సినీ స్వాగతం పలికింది. ఆ చిత్రంలో ‘భారత నారి చరితం…’ అనే హరికథ వేటూరిగారిలోని పండితీ ప్రకర్షకు నిదర్శనం. ఆ హరికథ అప్పట్లో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనలవి కాదు. ఆయన, పండితులని మెప్పించే పాటల్ని అలవోకగా రాయడమే కాదు… సినిమా కధకు అవసరమైన విధంగా అల్లరి పాటల్ని సైతం రాసి ఔరా? అనిపించారు. ‘శంకరాభరణం’లాంటి సినిమాల్లో సాహితీ విశ్వరూపాన్ని చూపిస్తూనే… మరోపక్క ‘అడవిరాముడు’లాంటి పక్కా కమర్షియల్‌ చిత్రాలకు కూడా పనిచేసి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నా…’ తరహాలో ఊర మాస్‌ పాటలు కూడా ఆయన కలం రాసింది. అందుకే… వేటూరి కలానికి రెండువైపులా పదును ఉందని… ఆయన అభిమానులు పరవశించిపోతుంటారు.

సాహితీ వనంలో విరిసిన నవనవోన్మేష అక్షర పారిజాతం. ఉదహరించాలంటే… హృదయం చాలదు. ‘అడవిరామూడు’ చిత్రంలో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు…’ అన్న పాట స్ఫూర్తివంతమైన గీతం. అదే సినిమాలో ‘అమ్మ తోడు, అబ్బ తోడు’, ‘ఎన్నాళ్లకెన్నాళ్లకు…ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకు…’ అంటూ ఆయన కలం వీర విహారం చేసింది. 1977లో వచ్చిన ‘పంతులమ్మ’ చిత్రంలోని పాటలు కూడా వేటూరికి ఎంతో పేరు తెచ్చాయి. అవార్డులు, పురస్కారాలను అందించాయి. ఆ చిత్రంలో ‘మానసవీణ మధు గీతం’ సంగీత సాహిత్యాల అత్యద్భుత కలయికగా పేర్కొనవచ్చు. ‘సిరిసిరి మువ్వ’ చిత్రం కూడా వేటూరి ప్రతిభకు అద్దం పట్టింది. ‘జుమ్మంది నాదం…’, ‘గజ్జె ఘల్లు మంటుంటే…’, ‘అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ…’, ‘రా దిగిరా.. దివి నుంచి భువికి దిగిరా..’ అనే పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ‘గోరింటాకు’లో ‘కొమ్మ కొమ్మకు సన్నాయి…’ ఇప్పటికీ మరిచిపోలేని వేటూరి గీతం. ‘శంకరాభరణం’ చిత్రంలో పాటలు సాహితీ అభిమానుల ప్రాత:స్మరణీయాలు. ‘ఓంకారనాదాను…’ పాట ఆయనకు ఎంత పేరు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ‘మంచు పల్లకి’లో ‘మేఘమా.. దేహమా’, ‘మేఘ సందేశం’లో ‘ఆషాడ మాసాన’, ‘పాడనా వాని కల్యాణిగా’, ‘సితారా’లో ‘కిన్నెర సాని వచ్చిందమ్మ’, ‘జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన’, ‘అగ్ని పర్వతం’లో ‘ఈ గాలిలో’…ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తరబడి ఆయన చేసిన కృషికి శిరసొంచి నమస్కరించాల్సిందే. మరీ ప్రత్యేకించి, ‘ప్రతిఘటన’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో..’ పాట గుండెల్ని కుదిపేస్తుంది. ‘అన్వేషణ’లో ‘ఎదలో లయ’, ‘ఏకాంత వేళ’, ‘కీరవాణి’ పాటలు మధుర తరంగాలు.

ఆయన రాసిన ‘మానసవీణ మధు గీతం’ పాటకి నంది పురస్కారం లభించింది. ‘శంకరాభరణం’ చిత్రంలో ‘శంకరా నాద శరీర పరా’ పాటకి, ‘కాంచన గంగ’లో ‘బృందావని ఉంది’ పాటకి, ‘ప్రతిఘటన’లో ‘ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో’…పాటకి, ‘చంటి’ చిత్రంలో ‘పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం’, ‘సుందరకాండ’లో ‘ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి’ పాటలకు నందులు నడిచొచ్చాయి. అలాగే, ‘రాజేశ్వరి కళ్యాణం’ చిత్రం కోసం ‘ఓడను నడిపే’, ‘గోదావరి’ చిత్రం కోసం ‘ఉప్పొంగెలే గోదావరి’ పాటలకి కూడా నందులు నడిచొచ్చాయి. ఇదే పాటకి ఫిలింఫేర్‌ అవార్డు కూడా వచ్చింది.

మాతృదేవో భవ’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ జాతీయ పురస్కారం లభించింది. అదే సినిమాలోని ‘వేణువై వచ్చాను భువనానికి…గాలినై పోతాను గగనానికి’ పాటకి మనస్విని అవార్డు వరించి వచ్చింది.

మనమధ్య మనతోనే కదలాడిన ఋషితుల్యుడు వేటూరి సుందరరామ్మూర్తి. ఈరోజు అయన వర్థంతి.