NRI-NRT

OCI ఉంటే ఇండియా బయల్దేరవచ్చు

Govt Of India Announces OCI Card Holders Can Come To India

ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్‌కు వచ్చేందుకు వారికి అనుమతిచ్చింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 7న వీసాలపై నిషేధం విధించింది. తాజాగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ఓసీఐ కార్డుదారులకు భారత్‌కు వచ్చేందుకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది.

* విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి, ఓసీఐ కార్డు కలిగిన వారిని భారత్‌కు వచ్చేందుకు అనుమతిస్తారు.

* కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించడం వంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత్‌కు రావాలనుకునే ఓసీఐ కార్డుదారులు ప్రయాణించొచ్చు.

* భారత్‌లో శాశ్వత నివాసం కలిగి ఉన్న భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరికి ఓసీఐ కార్డు ఉంటే వారికి భారత్‌కు వచ్చే అవకాశం ఇస్తారు.

* విదేశీ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఓసీఐ కార్డు కలిగిన విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఉంది. అయితే, వారి తల్లిదండ్రులు భారత పౌరులై భారత్‌లో నివసిస్తున్నవారై ఉండాలి.