దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించడం మదుపర్లను కలవరపెట్టింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారటోరియం గడువును మరో మూడు నెలల పాటు పొడిగించడంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడుతున్న సెన్సెక్స్.. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో సుమారు 400 పాయింట్ల మేర నష్టపోయింది. తర్వాత స్వల్పంగా కోలుకుని 260.31 పాయింట్ల నష్టంతో 30,672.59 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 67 పాయింట్లు నష్టపోయి 9,039.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.95గా ఉంది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. జీ ఎంటర్‌టైన్ మెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, శ్రీ సిమెంట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు చవిచూశాయి.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Related tags :