‘‘ప్రేక్షకులపై సినిమాల ప్రభావం ఎక్కువ. అందువల్ల, కథలు-చిత్రాల ఎంపికలో నేను జాగ్రత్త వహించాలి. మహిళలను గౌరవప్రదంగా, శక్తిమంతమైన పాత్రల్లో చూపించే చిత్రాలు చేయాలనుకుంటున్నాను. నేను ఇద్దరు పిల్లలకు తల్లిని కూడా! అందుకని, మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీవీ ఆన్ చేసినప్పుడు పిల్లలు ఏం చూస్తున్నారు? వాటి నుంచి ఏం నేర్చుకుంటున్నారు? అనేది గమనిస్తుంటా. వాళ్లకు నేను ఆదర్శంగా నిలవాలని, ఎగ్జాంపుల్‌గా ఉండాలని అనుకుంటున్నాను’’ అని జ్యోతిక అన్నారు. తమిళ కథానాయకుడు సూర్యతో వివాహానంతరం నటనకు కొంత విరామం ఇచ్చిన ఆమె, పునరాగమనంలో సందేశాత్మక మహిళా ప్రాధాన్య చిత్రాలలో నటిస్తున్నారు.‘‘ఈ ఏడాదితో నాకు 41 ఏళ్లు వస్తాయి. ఇప్పుడు నేను హీరోలా ఫీలవుతున్నా. నలభై ఒక్క ఏళ్లకు నేను హీరోనయ్యా’’ అన్నారామె. జ్యోతిక నటించిన తాజా చిత్రం ‘పొన్‌మగళ్ వందాళ్’. అందులో న్యాయవాది పాత్ర పోషించారు. త్వరలో ఓటీటీలో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ ‘‘మహిళా ప్రాధాన్య చిత్రాలను ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల సాధ్యం కాదు. భారీ సంఖ్యలో ప్రేక్షకులూ రారు. ఇటువంటి సమయంలో ఓటీటీలు విడుదల చేయడానికి ముందుకు రావడంతో నేను సంతోషంగా ఉన్నాను. సుమారు 200 దేశాల ప్రేక్షకులు ఓటీటీలో సినిమాను చూడొచ్చు. తద్వారా ఎక్కువమందికి చేరువ అవుతాయి. కదా?’’ అన్నారు. వాణిజ్య హంగులున్న చిత్రాల్లో, నృత్యాలకు పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటూ, సందేశాత్మక కథలు చేయడానికి గల కారణాలను జ్యోతిక వివరిస్తూ ‘‘నా చుట్టుపక్కల జరుగుతున్న సమస్యలను ప్రస్తావించే కథలను ఎంపిక చేసుకుంటున్నా. మహిళలు తెలివైనవారు. చాలా పనులను చక్కబెట్టగలరు. అటువంటి పాత్రల కోసమే నేనూ చూస్తున్నా. సుమారు 80 శాతం చిత్రాల్లో, నిజ జీవితంలో మహిళలు ఎలా ఉంటారో అలా చూపించరు. పాటల్లో నృత్యాలు చేసే చిత్రాలు చాలా చేసేశా. ప్రతి గృహిణి కథ, మరొకరి కథకు వైవిధ్యంగా ఉంటుంది. వాళ్ల కథలు ఎన్ని కావాలంటే అన్ని చెప్పవచ్చు. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, అటువంటి పాత్రలతో కూడిన కథలు ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను’’ అన్నారు.
ప్రేక్షకులు ఆనందిస్తే చాలు
Related tags :