కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేలా కనబడటం లేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయనతో జరిగిన సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణయింది. దీంతో గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముహిద్దీన్ యాసిన్‌కు కరోనా వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ స్క్రీనింగ్ చేయించుకుని, హోమ్ క్వారైంటన్‌లో ఉండాలని ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55) కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ముందుగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన తర్వాత వ్యాధి ముదరడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించడంతో బోరిస్ జాన్సన్ కోలుకున్నారు. కాగా, కోవిడ్-19 సోకడంతో స్పానిష్ రాణి మారియా థెరిసా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.