Sports

2021లో లేకపోతే…శాశ్వతంగా రద్దు

Olympics Committee Says It Will Cancel Olympics For Good If Not In 2021

కరోనా మహమ్మారి కారణంగా వచ్చే ఏడాదికి రీషెడ్యూల్‌ చేసిన టోక్యో ఒలింపిక్స్‌ను మరోసారి వాయిదా వేసే అవకాశం లేదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) చీఫ్‌ థామస్‌ బాచ్‌ స్పష్టం చేశాడు. 2021లో కూడా విశ్వక్రీడలను నిర్వహించడం కుదరకపోతే రద్దు చేస్తామని తెలిపాడు. వైరస్‌ ప్రబలడంతో ఈ ఏడాది జూలైలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది జూలై 23కు రీషెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న జపాన్‌ తరఫున కూడా ఆలోచిస్తున్నాం. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే రెండు, మూడు వేల మంది ఆర్గనైజింగ్‌ కమిటీ ఉద్యోగుల జీతభత్యాలు భరాయించడం కష్టం. క్రీడల వాయిదా అనేది ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నది. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు. భవిష్యత్‌ క్యాలెండర్‌ కూడా దెబ్బతింటుంది. అథ్లెట్లు గందరగోళానికి గురవుతార’ని బాచ్‌ చెప్పాడు. మెగా క్రీడలను మరోసారి వాయిదా వేయడం కష్టమని జపాన్‌ ఈపాటికే స్పష్టం చేసింది.