Editorials

సాహితీ సౌరభం…రాళ్లబండి

Remembering legendary literary personnel raallabandi kavitha prasad

ప్రసిద్ధ సాహితీవేత్త,అవధాన చక్రవర్తి ,నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణాదక్షుడు శ్రీరాళ్ళబండి కవితాప్రసాద్ జయంతి మే 21న ఆసందర్భంగా వారికి నివాళులు అcర్పిస్తూ…

జననం 21 మే 1961
మరణం 15 మార్చి 2015

ప్రముఖ తెలుగు అవధాని, కవి రాళ్ళబండి
కవితాప్రసాద్ కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో 1961, మే 21వ తేదీన జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజు గారు తెలుగు పండితులు. తల్లి పేరు రత్నవర్ధనమ్మ. సత్తుపల్లిలో గణితశాస్త్రం ఐచ్చిక అంశంగా పట్టభద్రుడయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అవధానవిద్యపై మసన చెన్నప్ప పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు
రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు.
తిరుమల తిరుపతి ధర్మప్రచార పరిషత్ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు.

ఇతని పర్యవేక్షణలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఇతడు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంత్రి కడియం శ్రీహరి వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 2015 మార్చి 15నహైదరాబాదులోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.

ఇతడు 500కు పైగా అవధానాలను చేశాడు. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచనకవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించాడు. ఒకసారి 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందాడు. వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతకరచన ధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పాడు. ఆశుకవితా ఝరి పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పాడు.

ఒంటిపూలబుట్ట, ఇది కవి సమయం, అగ్ని హింస, పద్య మండపం వంటి ప్రముఖ పుస్తకాలను ఆయన రచించారు. సాంస్కృతిక, భాషా రంగంలో ఆయన అందించిన సేవలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
ఆంధ్ర దేశంలో ప్రముఖ అవధానులలో శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ ఒకరు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం చేస్తూ కూడా కవితాప్రసాద్ గారు తమకున్న సమయంలోనే సాహితీసేవ చేశారు. అనేక కవితలను రాసి వాటిని సంకలనాల రూపంలో వెలువరించారు. అష్టావధాన ప్రియులు.
అష్టావధానాలు, శతావధానాలు సరే, నవరస నవావధానం, అపూర్వదశావధానం, సాహిత్యప్రక్రియావధానం, విచిత్ర అష్టావధానం,
(24 నిమిషాల్లో అష్టావధానం చేయడం)
అలంకార అష్టావధానం గంటకు 300
కందపద్యాల వేగంతో ఆశుకవితాఝరి నిర్వహించడం, శతలేఖినీ పద్య సంధానం
ఈయన ప్రత్యేకతలు.

రాళ్ళబండి కవితాప్రసాద్ గారు “అవధాన విద్య- ఆరంభ వికాసాలు” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని వెలువరించారు. అవధాన విద్య యొక్క ఆరంభ వికాసాలను పరిశోధించడమే లక్ష్యంగా, ఆ సిద్ధాంత వ్యాసాన్ని-
(1) అవధాన విద్యా స్వరూపం – చరిత్ర
(2) అవధాన విద్య – ప్రక్రియా వైవిధ్యం
(3) అవధానాంశాలు – పరిశీలన
(4) అవధానంలో కవిత్వాంశ
(5) అవధాన వివాదాలు మరియు
(6) పర్యాలోకనం
అనే ఆరు అధ్యాయాలుగా విభజించారు. అవధానాల చరిత్రని, వాటి పరిణామ దశలని వివరించారు. ఇప్పటికి 750 సంవత్సరాలకు పూర్వమే అవధానాలు ఉండేవని, కాలక్రమంలో అష్టావధానం, శతావధానం మాత్రమే విరాజిల్లాయని; ‘అష్టావధానం’, ‘శతావధానం’ అన్న పదబంధాలు తెలుగు భాషలో నుడికారాలుగా మారిపోయాయని ఆయన అనేవారు. ఈ సిద్ధాంత గ్రంథంలో అవధానాంశాలైన సమస్యాపూరణం, దత్తపది, నిషేధాక్షరి వంటి 50 రకాల అంశాలతో పాటుగా అవధానాల్లో విశేషంగా కనిపించే అపూర్వవర్ణనా నైపుణ్యం, స్వీయకవిత్వముద్ర, భావుకత, అలంకార ప్రయోగ నైపుణ్యం, చమత్కారం – చాటు కవితాస్ఫూర్తి అనే ప్రతిభాపంచకాలను ఈ గ్రంథంలో వెల్లడించారు. అలాగే, అవధాన చరిత్రలో తలెత్తిన వివాదాలను ప్రస్తావించారు.
తెలుగు సాహిత్యానికి రాళ్ళబండి కవితాప్రసాద్ గారు చేసిన కృషి మరవలేనిది.

వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ…