తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం మే 25వ తేదీ నుండి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గల టిటిడి కల్యాణమండపాల్లో అందుబాటులోకి రానుంది. అయితే, కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలోని టిటిడి కల్యాణమండపంలో లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేంత వరకు సగం ధరకే స్వామివారి లడ్డూప్రసాదాన్ని అందించాలని టిటిడి నిర్ణయించింది.
ఈ మేరకు చిన్నలడ్డూ ధరను రూ.50/- నుండి రూ.25/-కు తగ్గించారు. లడ్డూప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టిటిడి కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141 లేదా 1800425333333 సంప్రదించవచ్చు.
ఎక్కువ మొత్తంలో అనగా 1000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయదలిచిన భక్తులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబరు వివరాలను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com అనే మెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది. లడ్డూలు పొందడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా సంబంధిత భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో లడ్డూల కోసం అనుమతి పొందిన భక్తులు లభ్యతను బట్టి తిరుపతిలోని టిటిడి లడ్డూ కౌంటర్ నుండి గానీ, సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టిటిడి కల్యాణమండపాల నుండి గానీ పొందవచ్చు. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఆయా కల్యాణమండపాల వద్ద లడ్డూలు పొందేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి వచ్చిన అనంతరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లో లడ్డూప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది.