Movies

సృజనాత్మక దర్శకుడు…కోవెలమూడి

K Raghavendra Rao Birthday Special

రొమాంటిక్‌ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్‌ థ్రిల్లర్, జీవిత కథలు…ఇలా ఆయన వెండితెరపై టచ్‌ చేయని అంశం లేదేమో. సినిమా అంతా ఒకెత్తైతే… పాటలు మరో ఎత్తు అనేలా ఆయన దర్శకత్వం సాగుతుంటుంది. పండ్లు, పూల నేపథ్యంలో పాటల్ని తెరకెక్కిస్తూ వెండితెరని ఒక పెయింటింగ్‌లా మార్చేస్తుంటారు. కథానాయికలు రెట్టింపు అందంతో కనిపిస్తుంటారు. ప్రతి కథానాయిక రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక్కసారైనా సినిమా చేయాలని ఆశపడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల వరుసగా తీసిన ‘శిరిడీసాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలతో ఆయన భక్తి ప్రధానమైన కథలపైనే దృష్టిపెట్టినట్టు అర్ధమవుతోంది. కె.రాఘవేంద్రరావు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ‘శాంతినివాసం’ అనే ధారావాహికకి రచయితగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కోయిలమ్మ, సై సై సయ్యారే, అగ్నిసాక్షి చిత్రాల వెనక కూడా రాఘవేంద్రరావు ఉన్నారు. యాభయ్యేళ్లుగా సాగుతున్న తన సినీ ప్రయాణం… అందులో అనుభవాల్ని రంగరించి, నేటి తరానికి ఒక పాఠంగా ‘సౌందర్య లహరి’ని తీసుకొచ్చారు. తనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఇందులో కె.రాఘవేంద్రరావు పంచుకొన్న అనుభవాలు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. 2014లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతోపాటు… బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారం పురస్కారాల్ని అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’ చిత్రాలకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాలు స్వీకరించారు. పెళ్లిసందడి’ చిత్రంలో ఒక పాట నృత్య దర్శకత్వానికిగానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కూడా నంది అందుకొన్నారు. రాఘవేంద్రరావుకి భార్య సరళతోపాటు, తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి, కూతురు మాధవి ఉన్నారు. ప్రకాష్‌ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు.