DailyDose

అయిదో స్థానంలో దూసుకెళ్తున్న ఇండియా-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-India Going Stron At No.5 In Corona Cases

* నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

* తెలంగాణలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కరోనా వ్యాప్తికి ముందు ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్‌ చేసిన ఉన్నత విద్యామండలి తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

* దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గడం లేదు. దీంతో ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌-5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యధికంగా భారత్‌లోనే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి.

* టాలీవుడ్‌లో మరో విషాదం. ఈ రోజు ఉదయం వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఎనిమిదేళ్ల వయసులో మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్ర నటుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు ఎంతో మంది సినీ నటుల గొంతులను ఆయన అనుకరించేవారు. కేవలం సినిమాల్లో వారు చెప్పిన డైలాగ్‌లు అనుకరించడమే కాదు, కొన్ని చిన్న స్కిట్‌లను వారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించేవారు. అవన్నీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవి. సినీనటులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌, వీహెచ్‌ తదితర నేతలను హరికిషన్‌ అనుకరించి అలరించేవారు. పలు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించారు.

* సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌(36) ఆత్మహత్య చేసుకున్నారు. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలికుండ్రంలోని ఫామ్‌హౌస్‌లో అభినయ్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల తెల్ల కండువా మెడలో వేసుకొని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సీఎం వేసుకుంటున్న కండువాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆయన మెడలో వేసుకుంటున్నవి సిరిసిల్ల సెల్లాలు. పల్లెల్లో ఇప్పటికీ పెద్దవారు సెల్లాలను ధరిస్తుంటారు. దుమ్మూధూళి సహా ఎండ నుంచి రక్షణ కోసం వీటిని వాడుతుంటారు. కరోనా వైరస్‌ వల్ల ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరైంది. మాస్కులకు బదులుగా కొందరు దస్తీలు, తువ్వాలను కట్టుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ సెల్లాలను ధరించడం అంతటా చర్చనీయాంశమైంది. చేనేత కార్మికులను బాసటగా నిలవడం సహా కండువాల ప్రాధాన్యతను తెలియజేయడం కోసం కేసీఆర్‌ ఇలా సెల్లాలను ధరిస్తున్నారని తెలుస్తోంది.

* బాలీవుడ్‌ నటి, నిర్మాత అనుష్క శర్మ నిర్మించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌‌ లోక్‌’పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీనిలో తమను అవమానకరంగా చిత్రీకరించారంటూ గూర్ఖా సమాజానికి చెందిన కొందరు ఆరోపించారు. ఈ మేరకు ‘ద ఆల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ గూర్ఖా యూత్‌ అసోసియేషన్‌’ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు అన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.