NRI-NRT

USCISపై ITServe గెలిచింది

USCIS Agrees To Cancel Contract Between ITServe

అమెరికాలో ఐటీ ఖాతాదారుల (క్లయింట్ల) వద్ద ‘ఆన్‌సైట్‌’ పద్ధతిలో పనిచేయడానికి హెచ్‌-1బి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అంతకు ముందు ఎక్కడ పనిచేసిందీ… పూర్తి వివరాలు ఇకపై చెప్పాల్సిన పనిలేదు. ఈ మేరకు అమెరికాలో ఇమిగ్రేషన్‌ వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ అయిన యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌)తో యూఎస్‌లోని ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అయిన ఐటీసర్వ్‌ అలియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు వీసా దరఖాస్తుదార్లు ఎక్కడెక్కడ, ఏ సమయంలో పనిచేశారనే పూర్తి సమాచారాన్ని యూఎస్‌సీఐఎస్‌కు అందించాల్సి వచ్చేది. ఇటువంటి సమాచారం ఇవ్వని పక్షంలో వీసా దరఖాస్తును తిరస్కరించటం, లేదా మూడేళ్ల లోపు కాలానికి వీసా గడువును పరిమితం చేయటం జరిగేది. ఇది యూఎస్‌లోని క్లయింట్లకు సేవలు అందించే ఐటీ కంపెనీలకు ఎంతో ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటూ వచ్చింది. గత పదేళ్లుగా ఈ విధానం అమల్లో ఉంది. ఈ విషయంలో ఐటీసర్వ్‌ అలియన్స్‌ గత కొంతకాలంగా యూఎస్‌సీఐఎస్‌తో సంప్రదింపులు సాగిస్తూ, తిరస్కరించిన వీసా దరఖాస్తులపై పోరాటం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగి పని చేసిన సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలనే నిబంధనలు ఉన్న ‘2018 కాంట్రాక్ట్‌ అండ్‌ ఇటినరీ మెమోరాండమ్‌’ ను ఉపసంహరించుకునేందుకు తాజాగా యూఎస్‌సీఐఎస్‌ అంగీకరించింది. గత రెండేళ్లుగా ఈ అంశంపై తాము క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు, ఫలితంగా ఎంతో కీలకమైన మార్పు సాధ్యమైనట్లు ఐటీసర్వ్‌ అలియన్స్‌ పేర్కొంది.