Sports

బౌలర్లపై ఐసీసీ ప్రత్యేక దృష్టి

ICC Focusing On Bowlers And Fitness During Corona Times

క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఐసీసీ తెలిపింది. వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే అవకాశముంటే క్రికెట్‌ను పునఃప్రారంభించొద్దని స్పష్టం చేసింది. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వెల్లడించింది. బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు సూచనలు చేసింది.

క్రికెట్లో ఎక్కువగా బౌలర్లు గాయపడేందుకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు ఎక్కువగా పరుగెత్తాలి. ఫిట్‌నెస్‌ స్థాయి అత్యుత్తమంగా లేకపోతే కష్టం. ‘టెస్టు క్రికెట్‌ ఆడేందుకు కనీసం 8-12 వారాల సన్నద్ధత అవసరం (బౌలర్లకు). చివరి 4-5 వారాల్లో అంతర్జాతీయ స్థాయిలో తీవ్రత కొనసాగించాలి. తక్కువ సమయం సాధన చేసి ఆడితే బౌలర్లు గాయపడతారు. వయసు, శారీరక శ్రమను పరిగణనలోకి తీసుకొని శిక్షణ పొందాలి’ అని ఐసీసీ తెలిపింది.

షెడ్యూలు ప్రకారం ఆగస్టులో పాకిస్థాన్‌ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాలి. మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ పోటీలు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశముంది. స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌ సహా 18 మంది ఇంగ్లిష్‌ బౌలర్లు ఇప్పటికే తమ కౌంటీ మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20లు ఆడేందుకు 5-6 వారాలు, వన్డేలు ఆడేందుకు 6 వారాల సన్నద్ధత, సాధన అవసరమని ఐసీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆఖరి రెండు వారాల్లో తీవ్రత పెంచాలని సూచించింది.