DailyDose

వరంగల్ మృతదేహాల రహస్యాలు దొరికాయి-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Warangal DeadBodies Mystery Solved

* వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట వద్ద బావిలో తొమ్మిది మంది విగతజీవులై కనిపించిన కేసులో మిస్టరీ వీడింది. శీతల పానీయంలో నిద్ర మాత్రలు కలిపి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్‌ కుమార్ యాదవ్‌ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ కేసులో మొదట గురువారం నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలాయి. శుక్రవారం మరో అయిదు శవాలు బావిలో వెలుగు చూశాయి. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం కుటుంబంతో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండి కూలి పనులు చేసేవాడు. కొద్ది నెలల క్రితం గన్నీ సంచుల తయారీ పరిశ్రమలో పనికి చేరి, అక్కడే కుటుంబంతో నివసిస్తున్నాడు. మక్సూద్‌(55), అతడి భార్య నిషా (48), కుమార్తె బుస్రా (22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలను గురువారం రాత్రి వెలికితీశారు. మక్సూద్‌ కుమారులు షాబాద్‌ అలం(21), సోహెల్‌ అలం(18) మృతదేహాలతో పాటు, బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం(21), శ్యాం(21), పశ్చిమబెంగాల్‌కు చెందిన షకీల్‌(30) మృతదేహాలు శుక్రవారం బావిలో కనిపించాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని నిందితుడు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్‌ కుమార్ నిజం అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్య సంబంధించిన పలు సంచలన విషాయాలను వెల్లడించారు. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనే సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే ఢిల్లీలో మక్సూద్‌ ఆలం అల్లుడు ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్‌ చెప్పడం కొస మెరపు. ఇక మక్సూద్‌ భార్య, కూతురితో సంజయ్‌ వాట్సప్‌ చాటంగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తొలుత ఇద్దరు బిహారీలను వదిలేద్దామని సంజయ్‌ భావించగా.. కేసు బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం సంజయ్‌ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్‌ పోలీసులు కేసును చేధించడం గమనార్హం. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్‌ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. శుక్రవారం మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం,సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌(30) అనే డ్రైవర్‌ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్‌ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్‌ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానితుడి భావిస్తున్న సంజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కోణంలోనే తొలి నుంచి విచారించారు. పోలీసులు భావించిన విధంగానే వారు హత్యకు గురైయ్యారు.

* తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్‌ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి ఆవేశంతో తన తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు. అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న తన భార్య మెడలోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉండగా.. గర్భవతి అయిన ఆయన భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

* నెలవారీ కరెంటు బిల్లు చూసిన ఆ వినియోగదారుడికి షాక్‌ కొట్టింది. సర్లే.. విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందనుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. తీరా వాళ్లిచ్చిన సమాధానం చూసి అతగాడికి ఈ సారి అదిరిపోయే షాక్‌ కొట్టింది. కరెంటు బిల్లు తక్కువ కావాలంటే కాంగ్రెస్‌ను ఎన్నుకో అని వారు సమాధానం చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

* వైకాపా నాయకుల భూదందాలను నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెదేపా నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, శ్రవణ్‌ కుమార్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో భూములను ఆక్రమించారని ఆ పార్టీ ఆరోపించింది. వాటిని పరిశీలించేందుకు కమిటీ సభ్యులు అమరావతి వెళ్లనున్నారని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని తెదేపా పొటిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణలో కరోనా వివరాలు దాచే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…కొవిడ్‌ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు చేయడంలేదని ఆక్షేపించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకుని ప్రశ్నించారు. కరోనా పరీక్షలు చేయకపోవడం వల్లే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్‌ చెప్పిన కరోనా రహిత తెలంగాణ ఏమైందని ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారి వివరాలు కూడా వెల్లడించడంలేదని బండి సంజయ్‌ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

* జగన్‌ ఏడాది పాలన వైకాపా నాయకులకే 100శాతం సంతృప్తి తప్ప ఏ వర్గానికి ఒరగబెట్టింది లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు నవ మోసాలుగా చేసినందుకు 100 మార్కులా అని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉన్న స్కీములు రద్దు చేసి పేర్లు మార్చారే తప్ప కొత్తగా ఇచ్చింది శూన్యమని ఆక్షేపించారు. తప్పుడు కేసులతో అన్ని వర్గాల ప్రజలను క్షోభ పెట్టారని దుయ్యబట్టారు. వైకాపా నిర్వాకాలతో విశాఖ గ్యాస్‌ లీకేజీలో 12 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

* ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి (ఏఐజీ)లో కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైందని ఆయన తమ్ముడు, ప్రభుత్వ వాస్తు సలహదారుడు సుద్దాల సుధాకర్‌తేజ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఏఐజీ వైద్యులు రాజశేఖర్‌, బాలచందర్‌ నేతృత్వంలో శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అశోక్‌తేజకు, ఆయనకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఇవి విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన అన్నయ్య అశోక్‌తేజ తమతో మాట్లాడారని పేర్కొన్నారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన ఏఐజీ వైద్య బృందానికి, రక్తదానం చేసిన దాతలకు, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు, ఎప్పటికపుడు వాకబు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి సుధాకర్‌తేజ కృతజ్ఞతలు తెలిపారు.