DailyDose

బిలియన్ల ప్రవాహం ఆగలేదు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Bezos And Zuckerberg Never Affected

* దేశవ్యాప్తంగా మే 23వ తేదీ నాటికి 2,813 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా 37 లక్షల మంది ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటిలో 80 శాతం రైళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకే వెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది. 60 శాతం రైళ్లు గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి బయలుదేరగా.. వాటిలో ఎక్కువ భాగం రైళ్లు యూపీ‌, బిహార్‌ వెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది.

* ఉడాన్‌ పథకం కింద నిర్వహిస్తున్న విమాన సర్వీసులను పునర్‌ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పురి ట్వీట్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాలు, ద్వీపాలు, తక్కువ దూరం ఉన్న రూట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశలవారీగా విమానాల సంఖ్య పెంచుతామని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎప్పటి నుంచి సర్వీసులు ప్రారంభం, మార్గదర్శకాలు తదితర వివరాలు త్వరలో మంత్రిత్వశాఖ వెల్లడించనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ విమాన సర్వీసులు నిలిపేసిన విషయం తెలిసిందే.

* శ్రామిక్‌ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే ప్రకటన విడుదల చేసింది. ద.మ.రైల్లే జోన్ పరిధిలో 16 రోజుల్లో మొదటి లక్ష మందిని చేరవేర్చినట్లు వెల్లడించింది.

* కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. లక్షల కోట్లకు అధిపతులైన వారు కూడా నష్టాలను చవి చూశారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం కరోనా ప్రభావానికి అతీతంగా ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. వారే ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బోజోస్‌లు. ఈ కరోనా కాలంలో బెజోస్‌కు 34.6బిలియన్‌ డాలర్ల ఆదాయం చేకూరగా, జుకర్‌బర్గ్‌ 25బిలియన్‌ డాలర్లు ఆర్జించారు. మార్చి-మే నెలల మధ్య వీరు ఈ మొత్తాన్ని సంపాదించినట్లు ఫోర్బ్స్‌ గణాంకాల ద్వారా వెల్లడైంది.

* మారుతీ సుజుకీకి చెందిన మనేసర్‌ప్లాంటులో ఒక ఉద్యోగికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ తేలినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంకో కేసు కూడా వచ్చే అవకాశం ఉందని.. అయితే ఈ పరిణామం వల్ల ప్లాంటు కార్యకలాపాలపై ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా 50 రోజుల అనంతరం ఈ నెల మొదట్లో ప్లాంటులో కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే. ‘మే 15న సాధారణ ఆరోగ్యంతోనే సదరు ఉద్యోగి విధులకు హాజరయ్యారు. ఆయన నివాసం కంటైన్‌మెంట్‌ ప్రాంతంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి ప్లాంటుకు రావడం లేద’ని ఆ ప్రతినిధి తెలిపారు.