జూన్ 30వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి బుక్ చేసుకున్న వారికి రీఫండ్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో మే 31వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా, ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-దర్శన్ కౌంటర్ల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, రూ. 300- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతిలను టిటిడి రద్దు చేసింది.
బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివరాలను excel టెక్ట్స్ లో టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది. భక్తులు స్కానింగ్, జిరాక్స్ కాపిలను పంపిన ఎడల వాటిని పరిశీలించబడదు.
మెయిల్ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
కాగా శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్‌లైన్‌లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు రద్దు చేసుకోవడం వీలుపడదు.
అయితే, ఆలయం తెరచిన తరువాత దాతలు కోరిన తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది.
ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.