DailyDose

తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 805 కేసులు-TNI కరోనా బులెటిన్

805 New Positive Corona Cases In Tamilnadu-TNILIVE Corona Bulletin

* తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్తున్న సమయంలో ఆంధ్రా సరిహద్దు దగ్గర పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని కొంతమంది విమర్శలు చేశారు. దీనిపై పార్టీ ప్రతినిధి కె.పట్టాభిరాం స్పందించారు. ‘‘అది పథకం ప్రకారం జరిగినది కాదు. ఇలాంటివి వద్దని చంద్రబాబు నాయుడు ముందే చెప్పారు. కానీ కొంతమంది పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది’’ అని చెప్పారు.

* భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు నమోదైన కరోనా కేసుల సంగతి చూస్తే…
* పంజాబ్‌లో కరోనా బాధితుల సంఖ్య 2,081కి పెరిగింది. ఈ రోజు తాజాగా 21 మందిని గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 మాత్రమే యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 40 మంది చనిపోగా, 1,913 మంది రికవరీ అయ్యారు.
* అసోంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 445కి చేరింది. ఈ రోజు నమోదైన 48 కేసులతో కలిపి రాష్ట్రంలో 514 కరోనా కేసులున్నాయి. ఇప్పటివరకు నలుగురు చనిపోగా, ముగ్గురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 62 మంది డిశ్చార్జి అయ్యారు.
* గౌతమ్‌ బుద్ధానగర్ జిల్లా‌లో ఈ రోజు 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 359కి పెరిగింది. ఇందులో 119 యాక్టివ్‌ కేసులు కాగా, ఐదుగురు చనిపోయారు.
* జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 47 కరోనా కేసులు వచ్చాయి. ఇందులో 33 కేసులు కశ్మీర్‌ నుంచి రాగా, 14 కేసులు జమ్ము నుంచి వచ్చాయి. జమ్ములో మొత్తం కేసుల సంఖ్య 1,668గాను, కశ్మీర్‌లో 1,374గాను ఉంది. ఇప్పటివరకు రెండు ప్రాంతాలు కలిపి 23 మంది కరోనాతో చనిపోయారు.
* ముంబయిలో ధారావిలో ఈ రోజు 42 కరోనా కేసులు గుర్తించారు. వీటితో కలిపి ధారావిలో కరోనా కేసుల సంఖ్య 1583కి పెరిగింది.
* కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,182కి చేరింది. ఈ రోజు నమోదైన 93 కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో 1,431 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 44 మంది చనిపోయారు.
* కేరళలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 359కి పెరిగింది. ఇందులో ఈ రోజు నమోదైన కేసుల సంఖ్య 49. రాష్ట్రంలో ఇప్పటివరకు 532 మంది రికవరీ అయ్యారు.
* సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో ఈ రోజు నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 363కి పెరిగింది. ఇందులో ఇద్దరు చనిపోగా, 220 మంది రికవరీ అయ్యారు. 141 మంది చికిత్స పొందుతున్నారు.
* శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశంలో 40 లక్షల మందికిపైగా వలస కూలీలను స్వస్థలాలకు చేర్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి 3,060 రైళ్లు నడుస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా గుజరాత్‌ నుంచి 853, మహారాష్ట్ర నుంచి 5502, పంజాబ్‌ నుంచి 333, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి 221, దిల్లీ 181 బయలుదేరాయని కేంద్రం తెలపింది.

* కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధించడంతోపాటు వైరస్‌ సోకిన వ్యక్తుల్ని గుర్తించేందుకు లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో అధిక వృద్ధ జనాభా కలిగిన జపాన్‌లో వైరస్‌ తీవ్రత స్వల్ప కాలంలోనే అదుపులోకి రావడం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా దేశంలో విధించిన అత్యయికస్థితిని కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జపాన్‌ ఏవిధంగా వైరస్‌ను అరికట్టిందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

* తమిళనాడులో ఇవాళ రికార్డు స్థాయిలో 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 549 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 17,082గా ఉంది. ఈ రోజు మరో ఏడుగురు మృతి చెందగా… మొత్తం మృతుల సంఖ్య 118కి పెరిగింది. కరోనాను నుంచి కొలుకొని ఈ రోజు 407 మంది డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 8,731 మంది రికవరీ అయ్యారు.

* కొవిడ్‌ -19 సంక్షోభం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజల సమస్యలను లేవనెత్తడానికి కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేపట్టనుంది. ఈ నెల 28న వివిధ రాష్ట్రాలలో ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు ₹10,000లను నేరుగా నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేస్తోంది.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 273 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,606కి పెరిగింది. ఇప్పటివరకు 3,581 మంది నయమై డిశ్చార్జి అవ్వగా, కరోనాతో 165 మంది చనిపోయారు.

* ఉత్తరాఖండ్‌లో తాజాగా 15 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 332కి పెరిగింది. ఇందులో 58 మంది రికవరీ అవ్వగా, నలుగురు మృతి చెందారు.

* రాజస్థాన్‌లో ఈ రోజు 145 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,173గా ఉంది. ఇప్పటివరకు 163 చనిపోగా, 3150 మంది చికిత్స పొందుతున్నారు.

* రెండు నెలల తర్వాత దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడంతో నేడు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ రద్దీగా కనిపించాయి. అయితే, విమానాలకు సంబంధించి పక్కా సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా చివరి క్షణంలో సర్వీసుల్ని రద్దు చేయడంతో అనేక మంది నిరాశకు గురయ్యారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌ల్లోనే గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2,671కి చేరాయి. మృతులు 56కు చేరుకున్నారు. 1,848 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం ఆస్పత్రుల్లో 767 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విదేశాల నుంచి వారిలో కరోనా కేసుల సంఖ్య 62కి చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 153 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,845కి చేరింది. అత్యధికంగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌టెన్‌లోకి వెళ్లింది.