Movies

నన్ను లైంగికంగా వేధించారు

Aishwarya Rajesh On MeToo Experiences

‘‘చిత్ర పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్య రంగు. నా రంగు, శరీర ఛాయతో కొంతమందికి సమస్యే! ఉత్తరాది అమ్మాయిల తరహాలో ముస్తాబు కావడం, దుస్తులు వేసుకోవడం నాకు రాదు. అదీ ఓ సమస్యే! నేను తమిళం మాట్లాడానని కొంతమంది అవకాశాలు ఇవ్వకుండా తిరస్కరించారు. జీవితంలో లైంగిక వేధింపులు సహా అన్ని రకాల విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నాను. వేధించినవాళ్లకు, విమర్శకులకు సమాధానం చెప్పే సత్తా నాకు ఉంది. నేను బోల్డ్‌. మహిళలందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు. ఆమె ఎవరో కాదు… తెలుగులో ఒకప్పటి కథానాయకుడు, నటుడు రాజేశ్‌ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో ఐశ్వర్యా రాజేశ్‌ కుటుంబం కష్టాలు పడింది. అక్కణ్ణుంచి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో కథానాయికగా ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల తిరుచిరాపల్లి ఐఐఎమ్‌లో నిర్వహించిన ‘టెడ్‌ఎక్స్‌ టాక్‌ షో’లో తన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాల గురించి ఐశ్వర్యా రాజేశ్‌ వివరించారు.‘‘మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ప్రజలు ‘మురికివాడ’గా పిలిచే ప్రదేశం నుంచి వచ్చా. హౌసింగ్‌ బోర్డ్‌ అపార్ట్‌మెంట్‌లో అమ్మ, నాన్న, ముగ్గురు సోదరులు, నేను ఉండేవాళ్లం. నాకు 8 ఏళ్ల వయసులో నాన్న మరణించారు. తండ్రిలేని లోటు తెలియకుండా మమ్మల్ని అమ్మ పెంచింది. తను చాలా స్ట్రాంగ్‌, బోల్డ్‌. నాకు 11, 12 ఏళ్లు ఉన్నప్పుడు పెద్దన్నయ్యను కోల్పోయాం. తర్వాత ఏడాది, ఏడాదిన్నరకు మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుటుంబానికి అండగా ఎవరూ లేరు. అప్పుడు చాలా భయపడ్డా. తర్వాత నాకు సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. కానీ, చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. అదే విషయం అమ్మతో చెబితే ఎక్కువ పారితోషికం కావాలంటే సినిమాలు చేయమని సలహా ఇచ్చింది. ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో విజేతగా నిలిచా. డ్యాన్స్‌ కూడా వచ్చు కనుక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించా. మా కుటుంబానికి మద్దతుగా నిలవాలని! రంగు, శరీర ఛాయను సాకుగా చూపించి అవకాశాలు ఇవ్వలేదు. కొందరు దర్శకులు హాస్యనటులకు జంటగా నటించమని అడిగారు. అవి వద్దనుకున్నా. మంచి పాత్రల్లో నటించాలనేది నా కల. ‘అట్టకత్తి’లో చిన్న పాత్ర చేశా. ప్రేక్షకులకు నా నటన నచ్చింది. ప్రశంసలు దక్కాయి. తర్వాత ‘కాకా ముట్టై’ నా కెరీర్‌ను మార్చింది. నిజాయతీగా చెబుతున్నా, నమ్మండి… నన్నెవరూ నమ్మలేదు. నాకెవరూ అండగా నిలబడలేదు. నాకు నేనే అండగా నిలిచా. నన్ను నేను నమ్మాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అన్నారు.