శ్రీకృష్ణరాయని పట్టాభిషేక మహోత్సవం ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా ఉన్నదో తెలుసుకొందాం.
రాయల పట్టాభిషేకానికి అధిష్టానకర్తలు పూనుకోగా పండితులు శాస్త్రాలు తిరగవైచి, తిధివార నక్షత్రాలు గుణించి సలక్షణ ముహుర్తం నిర్ణయించి వైఢూర్య పొదిగిన బంగారు ముద్దుటుంగరాన్ని వ్రేలికి తొడిగారు.
హంపీలోని విరూపాక్షదేవాలయ(పంపాపతి) శాసనం ప్రకారం శాలివాహన శకం శుక్ల నామ సంవత్సరం 1430 లో (1509 AD)జరిగినట్లు కలదు.
పట్టాభిషేక మహోత్సవంనకు రాలేని మండలాధీశులు, మహరాజులు కానుకలు పంపారు.
ఈ పట్టాభిషేక వైభవాన్ని చూడటానికి వచ్చిన దళవాయి నాయకులు, కమ్మ ప్రభువులు, తుళువనాయకులు, నగర విద్వాంసులు, అవధానులు, పండితులు, జ్యోస్యులు మొ॥అంగరంగ వైభవంగా సభాస్థలిని అలంకరింప చేశారు.
వీధులన్ని సుందరంగా అలంకరింపచేశారు. రాచవీధిని ముత్యాల ముగ్గులతో రతనాల రంగవళ్ళులతో అలంకరింప చేశారు. అంతటా చలువ పందిళ్ళు వేశారు. చలివేంద్రాలను, ఆహుతులకు అతిథులకు ఉచిత పూటకూళ్ళను ఏర్పాటు చేశారు.ఊరంతా పచ్చతోరణాలు కట్టారు. దేవాలయాలన్నింట ఆగమ శాస్త్ర విధులతో ధూప దీప నైవేద్యాలు జరిగాయి.
బీదలకు అన్న వస్త్ర దానాలు చేశారు.ప్రతి ఇంట పండుగ వాతావరణం అలుముకొంది. ఎక్కడ చూచినా రాయలవారి పట్టాభిషేచర్చలే, అందరి వదనాలలో సంతోషఛాయలే.
ఆభాలగోపాలం పండితపామరులు ఆట పాటలతో ఆనందడోలికలలో మునిగిపోయారు.
ఆడమగ అందరూ పట్టుబట్టలు ధరించారు.సంతోషంతో నాట్య ప్రదర్శనలు జరిగాయి. విదేశీ రాయబారులకు, రాజులకు, వర్తకులకు విశ్రాంతి కొరకు మంత్రులు అధికారులు గుడారాలు, వసతులు ఏర్పాటు చేశారు.ఆవాంఛనీయ సంఘటలేవి జరగకుండా వేగులు, తలారులు జాగ్రత్తులై తిరిగారు. దేవదాసీలు నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరింపచేశారు.
ఇంతలో శంఖ,కాహళ, భేరి మొదలైన ప్రచండ వాద్యాలు మిన్ను ముట్టెలా మ్రోగాయి.రాయల వారిని మంగళస్నానాలకు సిద్ధం చేశారు.
దండనాయకులైన అయ్యమరసు, కొండమరసు, బాచరసు, ఎల్లమరసు, వీరమరసు, అప్పాజీ మొదలైనవారు,
దళనాయకులైన అప్పరపిళ్ళ, మన్నారుపిళ్ళ, రాయసం రామచంద్రయ్య, బొక్కసం భాస్కరయ్య, అవసరం వెంకయ్య, త్రియంబకయ్య లక్ష్మీపతి,దళవాయిలింగరసు,
ఇంకా ప్రధాని తిప్పరసు, ఆర్వీటి బుక్కరాజు, సాళువ మేకరాజు, శ్రీపతివారు, బూదహళ్ళివారు, ఔకువారు, నందేలవారు, తొరగెంటివారు,
రాచూరి తిమ్మరాజు, సంగరాజు, వెలుగోటివారు, పెదసాని అక్కప్ప నాయుడు, నగర విద్వాంసులు, అష్టభాషలలో కవైన కృష్ణవధానులు, శాబ్దికంపాండిత్యం వెంకటరామశాస్త్రుల, సహస్రావధాని ప్రభాకర శాస్త్రులు, ఇంకా అనేక మంది పెద్దలు రాయలవారికి శాస్త్రోక్తంగా జరిగిన మంగళస్నానంలో పాల్గొన్నారు.
అనంతరం రాయలవారిని కళ్యాణవేదికకు తెచ్చారు. అందులో బంగారం పీఠంపై కూర్చోబెట్టారు.రాయలచే షోడశ మహదానాలు, దశదానాలు చేయించారు.
ఇంకా రాయలు స్వర్ణతుల, రజతతుల, రత్నతులాభారం చేసి,ఆ ధనాన్ని, మౌక్తికమణులను, వేలాదిగోవులను బ్రాహ్మణులకు బీదలకు దానం చేశాడు.
దానధర్మాల అనంతరం చతుస్సముద్రాల నుండి బంగారు కలశాలలో తెచ్చిన నీటితోనూ, గంగా యమున నర్మదా సింధు కావేరి తామ్రపర్ణి నదుల నుండి తెచ్చిన పవిత్ర జలాలతో, ఎనిమిది రకాలైన వాద్యగోష్టులు మ్రోగుతుండగా శుభముహుర్తంలో బ్రాహ్మణులు వేదమంత్రాల నడుమ రాయలవారిని అభిషేకించారు.
నవరత్నఖచిత కిరిటధారణ మంత్రోచ్చాటునల మధ్య, కరతాళ ధ్వనుల సంరంభాల మధ్య రాయలవారికి వేదపండితులు కీరిటధారణ చేశారు.
రాయలు పిమ్మట చందన ఆగరు కస్తూరి గంధం పూసుకొని, నవరత్నఖచితమైన పీతాంబరాలు ధరించాడు. ఆపై రాయలకు కనకాభిషేకం జరిగింది.
షడ్రోపేతమైన భోజనాలు పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేశారు. భోజనానంతరం రాయలు అతిధులను తగురీతిన గౌరవించి వారివారి విడుదులకు పంపాడు.
రాయలు అయినవారితోనూ అల్లుళ్ళతోను వారి కుమారులతోనూ, బంధుమిత్రులతోనూ సహపంక్తిలో కూర్చుని భోజనం చేశాడు.భోజనానంతరం సుగంధ జలాలతో చేయి కడుక్కొన్నాడు.
పిమ్మట సంక్షేపరామాయణం చదివి వినిపించారు.రాయలు శత పదాలు(నూరు అడుగులు) మడుగు బట్టలపై నడిచి రత్న కంబళిపై కూర్చుని అప్పాజి, దళనాయకులతోనూ, ప్రధానులతోనూ గత పరిస్తులు చేయాల్సిన రాచ విధులు చర్చించాడు.