DailyDose

భారత పసిడి దిగుమతులు తగ్గాయి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Gold Imports Down In India

* అతి తక్కువ ధరకు డేటాను అందరికీ అందుబాటులోకి తెచ్చిన సంస్థ జియో. గత కొంతకాలంగా వివిధ రీఛార్జ్‌లపై ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జియో నెట్‌వర్క్‌లోని అతి తక్కువ ప్లాన్‌ రూ.98 ఒకటి. ఇప్పుడు దీని ధరను పెంచి రూ.129గా నిర్ణయించింది. దీంతో జియో అందించే ఆఫర్లలో ఇదే అతి తక్కువ ప్లాన్‌. రూ.129తో రీఛార్జ్‌ చేసుకుంటే 2 జీబీ డేటా, జియో-టు-జియో అపరిమిత కాల్స్‌, రోజుకు 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీని కాల పరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌ మాట్లాడాలంటే ఈ ప్లాన్‌తో పాటు అదనంగా టాప్‌ అప్‌ ఓచర్‌ను తీసుకోవాలి. జియో ఇటీవలే మరో ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారి సంఖ్య పెరగడంతో అలాంటి వారు రూ.999తో రీఛార్జ్‌ చేసుకుంటే 84రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను పొందవచ్చు. ఈ రీఛార్జ్‌తో ఇతర నెట్‌వర్క్‌లకు 3వేల కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. దీంతో పాటు రూ.599, రూ.399 ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వీటితో రోజుకు వరుసగా 2జీబీ, 1.5జీబీ డేటాను పొందవచ్చు.

* మసాలా దినుసుల తయారీ సంస్థ సన్‌రైజ్‌ ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ ఆదివారం ప్రకటించింది. ఐటీసీ వెల్లడించనప్పటికీ, ఈ లావాదేవీ విలువ రూ.1800-2000 కోట్లు ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సన్‌రైజ్‌ ఉత్పత్తులన్నింటినీ స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఐటీసీ తెలిపింది. ఇందువల్ల తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడంతో పాటు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలువుతుందని వివరించింది. ‘70 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సన్‌రైజ్‌ ఫుడ్స్‌ దేశ ఈశాన్య ప్రాంతంలో మసాలా దినుసులకు సంబంధించి మార్కెట్‌ లీడర్‌గా ఉంది. స్థానిక వినియోగదారులతో మంచి అనుబంధం ఉంది. అక్కడివారి అభిరుచులకు తగ్గ ఉత్పత్తులను అందించడం ఐటీసీకి ఇప్పుడు సులభం అవుతుంది’ అని ఐటీసీ పేర్కొంది.

* వరుసగా అయిదోనెలా దేశంలోకి పసిడి దిగుమతులు తగ్గాయి. ఆర్థిక సంవత్సర ప్రారంభ నెల అయిన ఏప్రిల్‌లో ఈసారి 28.3 లక్షల డాలర్ల (సుమారు రూ.21 కోట్ల) విలువైన పసిడి మాత్రమే దిగుమతి అయ్యింది. అదే 2019 ఏప్రిల్‌లో చూస్తే 397 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,775 కోట్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి కావడం గమనార్హం. ఇందువల్ల దేశ వాణిజ్య లోటు కూడా 1533 కోట్ల డాలర్ల నుంచి 680 కోట్ల డాలర్లకు దిగి వచ్చింది. ఇదే సమయంలో ముత్యాలు, ఆభరణాల ఎగుమతులు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ 360 లక్షల డాలర్ల (సుమారు రూ.270 కోట్ల)కు పరిమితమయ్యాయి. 2019 డిసెంబరు నుంచి కూడా పసిడి దిగుమతులు తగ్గుతూనే వస్తున్నాయి.

* దిల్లీ నాలుగు చక్రాల వాహనాల కర్బన ఉద్గారాల ప్రమాణాలకు సంబంధించిన బీఎస్‌-6 నిబంధనలను కేంద్ర రహదారులు, రవాణాశాఖ విడుదల చేసింది. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్స్‌ (ఫోర్త్‌ అమెండ్‌మెంట్‌)రూల్స్‌-2020 పేరిట గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. పెట్రోల్‌, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, బయోమీథేన్‌, హైడ్రోజెన్‌, హైడ్రొజన్‌+సీఎన్‌జీ, డీజిల్‌, బయోడీజిల్‌, ఇథనాల్‌ తదితర వాహనాల ఉద్ఘారాల పరిమితులను ఇందులో నిర్దేశించింది.

* కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులకు గ్రామీణ-పట్టణ విపణుల్లో గిరాకీ విషయంలో స్పష్టమైన విభజన ఏర్పడుతోందని ప్రముఖ సంస్థలు నెస్లే, డాబర్‌, గోద్రెజ్‌, పార్లే, విప్రో వెల్లడించాయి. పట్టణాలు, నగరాలలో ఏదైనా ఉత్పత్తిని పెద్ద పరిమాణంలో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందువల్ల తరచు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరాన్ని నివారిస్తున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ విపణులకొస్తే అందుబాటు ధరలో లభించే చిన్న ప్యాక్‌లకు ఆదరణ కనిపిస్తోంది. కరోనా వైరస్‌ భయంతో వినియోగదారులు రద్దీ అధికంగా ఉండే హైపర్‌ మార్కెట్లు, రిటైల్‌ స్టోర్లను ఎక్కువసార్లు సందర్శించడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. నెలలో ఒకసారి వెళ్లి కావాల్సిన సరకులన్నీ తెచ్చుకుంటారని, రాబోయే కొన్ని నెలల పాటు ఇదే ధోరణి ఉంటుందని తెలిపాయి. ఒకవేళ కొవిడ్‌-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆందోళనలతో, అధికంగా నిల్వ చేసుకునే వారూ ఉంటారని పేర్కొన్నాయి. ‘ఆర్థిక పరిమితుల కారణంగా వినియోగదారులు ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు. అందుకే పెద్ద ప్యాక్‌లలో, అందుబాటు ధరలో లభించే ఉత్పత్తులను (పీపీపీ) కొనుగోలు చేసి డబ్బును ఆదా చేసుకునేందుకు ప్రయత్నిస్తారని నెస్లే ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ నారాయణన్‌ అభిప్రాయపడ్డారు. ‘పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. వారు పట్టణ ప్రాంతాల్లో తక్కువ ధరలున్న చిన్న ప్యాక్‌లను కొనుగోలు చేసి ఉండటంతో, ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటికి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించడంతో గ్రామీణ గిరాకీ ఊపందుకుంటుంద’ని డాబర్‌ ఇండియా ముఖ్య ఆర్థికాధికారి (సీఎఫ్‌ఓ) లలిత్‌ మాలిక్‌ తెలిపారు. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ వివేక్‌ గంభీర్‌, పార్లే ప్రోడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా, విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.ప్రసన్నరాయ్‌, క్యాపిటల్‌ ఫుడ్స్‌ సీఈఓ నవీన్‌ తివారి కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

* కరోనా వైరస్‌ మహమ్మారితో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కంపెనీలు వ్యాపార సహకారం కోసం పోటీ చట్టం నిబంధనలను ఉల్లంఘించకుండా జాగ్రత్తపడాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సూచించింది. అన్యాయ వ్యాపార పద్ధతుల నుంచి ఆయా సంస్థలను రక్షించడానికి పోటీ చట్టంలో ఇప్పటికే పలు నిబంధనలు ఉన్నాయని సీసీఐ వెల్లడించింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించడానికి వ్యాపార సంస్థల నిర్వాహకులు కొవిడ్‌-19ను ఆసరాగా చేసుకోవద్దని హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావంతో ఎదుర్కొంటున్న అనిశ్చితి-కష్టాలను పరిష్కరించుకోడానికి, పోటీ సంస్థలతో సహకరించుకునేలా కంపెనీలు ప్రయత్నించవచ్చని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొన్న నేపథ్యంలో, సీసీఐ ఈ సూచనలు జారీ చేసింది. కంపెనీలు తీసుకునే అన్ని వ్యాపార నిర్ణయాలు కాంపిటీషన్‌ యాక్ట్‌-2002లోని నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని సూచించింది. కరోనా కష్టకాలంలో పోటీ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలను నిశితంగా గమనిస్తామని సీసీఐ హెచ్చరించింది. ఆధిపత్య సంస్థలు తమ ఉత్పత్తి, సేవలు, సాంకేతిక అభివృద్ధిని పరిమితం చేయడం, అధిక ధరలను నిర్ణయించడం, అవసరమైన సేవలు కావాలంటే అనవసరమైన ఉత్పత్తులను కట్టబెట్టడం వంటివి చేయకూడదని సీఐఐ హెచ్చరించింది. నిత్యావసర వస్తువుల తయారీ, అమ్మకాల్లో విపణిలో మంచి పంపిణీ వ్యవస్థ కలిగిన కంపెనీలు ప్రత్యేక పంపిణీ ఒప్పందాల్లోకి రాకూడదని పేర్కొంది.