కాలుష్య కోరల్లో చిక్కుకొని తమ రూపాన్నే కోల్పోయిన జీవనదులు.. అభివృద్ధి, ఆధునికత పేరిట మానవులు సృష్టిస్తున్న విధ్వంసానికి నిలువెత్తు సాక్ష్యాలు. వాటి స్వచ్ఛతను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న పాలకుల మాటలు దశాబ్దాలుగా నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.
కానీ, గత 25 సంవత్సరాల్లో రూ.5000 కోట్లు ఖర్చు చేసినా జరగని పని లాక్‌డౌన్ చేసిపెట్టింది. ఆంక్షల నేపథ్యంలో ఫ్యాక్టరీలు, కంపెనీలన్నీ మూతపడటంతో యమునా నది స్వచ్ఛతను సంతరించుకుంది. ఎవరి ప్రమేయం లేకుండా దానికదే శుభ్రపరచుకుంది. కాలుష్యం తగ్గడంతో వేలాది పక్షులు నదికి వలస కట్టాయి. ప్రకృతి ధర్మం మేరకు చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ తమ ఆకలి తీర్చుకుంటున్నాయి.
దాదాపు 1400 కి.మీ పొడవుండే యమునా నది ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదీ ఒడ్డున ఉన్న కాలనీల మురుగునీరు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలు అందులో వచ్చి చేరుతుంటాయి. హరియాణాలోని పానిపట్, దిల్లీ మధ్య దాదాపు 300 ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు నదిలో వచ్చి చేరుతాయి. దీంతో దేశంలోనే అత్యంత కాలుష్యమైన నదిగా యమునా నది నిలిచింది. 80 శాతం కాలుష్యం దిల్లీ, ఆగ్రా, మధుర మధ్యే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే లాక్‌డౌన్ వల్ల క్రితంతో పోలిస్తే దిల్లీ ప్రాంతంలో నది 33శాతం స్వచ్ఛతను సంతరించుకుందని ‘దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ తేల్చింది. ఇంకా.. మధుర దిశగా సాగితే నది మరింత శుభ్రంగా మారిందని తెలిపింది. గత ముప్ఫై ఏళ్లలో తాను నదిని ఇంత స్వచ్ఛంగా ఎప్పుడూ చూడలేదని ‘యమునా యాక్షన్ ప్లాన్’లోని ఓ సభ్యుడు తెలిపారు. ఇది సహజసిద్ధంగా నదులకు ఉండే సామర్థ్యం వల్లే సాధ్యమైందని కమిటీ పేర్కొంది. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యర్థాలు నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. క్రమంగా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వెంటనే దీనిపై ప్రభుత్వ యంత్రాంగాలు దృష్టి సారించాలని హితవు పలికింది.