* భారత్‌లో కొవిడ్ మహమ్మారి మరింత విజృంభిస్తోంది.గత 24 గంటల్లో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6535 మంది వైరస్ బారినపడ్డారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1695 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 52667కి చేరింది.గుజరాత్లో 888, మధ్యప్రదేశ్‌లో 300 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
* పశ్చిమ బంగలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఈ రోజు 193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,009కి పెరిగింది. ఇప్పటివరకు 1,486 మంది డిశ్చార్జి కాగా, 2,240 మంది చికిత్స పొందుతున్నారు. 211 మంది కరోనాతో చనిపోగా, 72 మంది కరోనాతో పాటు ఇతర రోగాలుండటంతో చనిపోయారు.
* తమిళనాడులో ఇవాళ 646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,728 కి చేరింది. ఈ రోజు మృతి చెందిన తొమ్మిది మందితో కలిపి ఇప్పటివరకు 127 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 8,256 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,342 మంది డిశ్చార్జ్ కాగా… అందులో ఈ రోజు డిశ్చార్జి అయినవారు 611 మంది. ఇక చెన్నై వరకు చూస్తే… ఈ రోజు 509 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,640కి పెరిగింది.
* కర్ణాటకలో ఈ రోజు 101 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సాయంత్రం ఐదు వరకు అందిన సమచారం చూస్తే… ఇప్పటివరకు రాష్ట్రంలో 2,283 కేసులు ఉన్నాయి. ఇందులో 1489 యాక్టివ్ కేసులు కాగా, 44 మంది చనిపోయారు. ఈ రోజు డిశ్చార్జి అయిన 43 మందితో కలిపి మొత్తంగా 748 రికవరీ అయ్యారు. ఈ రోజు ఎలాంటి మరణాలు సంభవించలేదు.
* ప్రపంచంలో ప్రతి లక్ష మందికి 4.4 మంది కరోనాతో చనిపోతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే మన దేశంలో అయితే 0.3 శాతం మందే చనిపోతున్నారని చెప్పింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ అని తెలిపింది. లాక్‌డౌన్ అమలు, కేసులు సమయానికి గుర్తించడం, మెరుగైన నిర్వహణ వల్లనే మనం ఇది సాధించగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
* దేశీయ విమానయాన సర్వీసులు ప్రారంభమైన తొలి రోజు 58,318 మంది ప్రయాణించారని విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. 25న అర్ధరాత్రి వరకు 832 విమానాలు నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని చెప్పిన ఆయన, ఈ రోజు విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
* ఉత్తరాఖండ్‌లో గత 24 గంటల్లో 51 కరోనా కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 400కి చేరింది. ఇందులో 329 యాక్టివ్ కేసులుకాగా, నలుగురు మృతి చెందారు.
* కరోనా వైరస్ కోరలు వంచే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు డజనుకు పైగా క్లినికల్ పరీక్షల దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ అనే కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకా కూడా చేరింది. దీన్ని ఆస్ట్రేలియాలో 131 మంది వాలంటీర్లపై పరీక్షించనున్నట్లు కంపెనీ పరిశోధనా విభాగం చీఫ్ గ్రెగరీ గ్లెన్ తెలిపారు. దీని ఫలితాలు జులై నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు.
* రాష్ట్రంలో వస్త్ర దకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, చెప్పుల దుకాణాలను తెరవడానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ అనుమతి మంజూరు చేసింది. నిర్దేశిత ప్రామాణికాలకు అనుగుణంగా దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. వాటి ప్రకారం చూస్తే… రాష్ట్రంలోని పెద్ద దుకాణాల్లో షాపింగ్ చేయడానికి ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. దుకాణాల్లోనూ ట్రయల్ రూములకు అనుమతి లేదు. ఆభరణాల దుకాణాల్లో వినియోగదారులకు డిస్పోజబుల్ చేతి తొడుగులు అందుబాటులో ఉంచాలి. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు మాస్కులు , గ్లవుజులు ధరించాలి. పానీపూరి బండ్లకు అనుమతి లేదు.
* కరోనా వైరస్ మహమ్మారిపై చేస్తున్న పోరులో భారత్‌కు సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. వైరస్‌పై పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పనిచేస్తాయని భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా భారత్‌కు చైనా సహకారం కొనసాగుతుందన్నారు. చైనాలోని జాక్‌మా, అలీబాబా ఫౌండేషన్లు భారత్‌కు ప్రకటించిన విరాళంలో భాగంగా రెండో దఫా వెంటిలేటర్లు, పీపీఈ కిట్లతో పాటు ఇతర వైద్య సామగ్రి దిల్లీకి చేరుకుందని వీడాంగ్ వెల్లడించారు.
* ఏపీలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,148 నమూనాలను పరీక్షించగా.. 48 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకుని తాజాగా 55 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.