Politics

ఎగువ రాష్ట్రాల ఇష్టారీతిని సహించను

YS Jagan Speaks On Irrigation Projects And Polavaram

రాయలసీమ కరవు నివారణకు చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎగువ రాష్ట్రాలు ఇష్టారీతిగా ప్రాజెక్టులు కట్టడం వల్ల నీరు అందని పరిస్థితి ఉందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిపిన మేధోమథనం సదస్సులో జగన్ ప్రసంగించారు. ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా ప్రాధాన్య క్రమంలో అందరికీ న్యాయం జరిగేలా వాటి నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. కేవలం ఏడాదిలోనే రూ.1,095 కోట్లు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మిగిల్చినట్లు చెప్పారు. కరోనా ప్రభావం వల్ల పోలవరం పనులు నిలిచిపోయాయన్నారు. 2021 నాటికి పోలవవరం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది వంశధార, నాగావళి, వెలిగొండ, సంగం, అవుకు టన్నెల్‌ పనులు పూర్తి చేస్తామని జగన్‌ వివరించారు. ‘‘శ్రీశైలంలో 796 అడుగుల వద్ద తెలంగాణ వారు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 800 అడుగుల వద్ద మనం 2 టీఎంసీలతో పంపులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టులతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. మనకు కేటాయించిన నీటిని మనమే తీసుకుందాం. శ్రీశైలం నుంచి 800 అడుగులకే నీరు తీసుకునేలా ప్రాజెక్టును చేపడతాం. రాయలసీమ కరవు నివారణకు రూ.27 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతాం. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకువచ్చే విధంగా సామర్థ్యాన్ని పెంచుతాం. గోదావరి నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు తెచ్చేలా సామర్థ్యాన్ని పెంచుతాం’’ అని సీఎం జగన్‌ వివరించారు. ‘‘గ్రామ స్థాయిలో వచ్చే ఏడాదిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు చర్యలు తీసుకుంటారు. గ్రామస్థాయిలోనే గోదాంలు, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది చివరి నాటికి జనతా బజార్లు అందుబాటులోకి తీసుకొస్తాం. 147 నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం’’ అని సీఎం జగన్‌ వివరించారు.