ఏపీ డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం
చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లే కనిపిస్తోంది. తాజాగా నగరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన కాకా రేపింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారా? అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదని.. ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కొందరు కుట్ర చేస్తున్నారని రోజా మండిపడినట్లు సమాచారం. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని కార్యకర్తలతో ఎమ్మెల్యే అన్నట్లు తెలుస్తోంది.
రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజవర్గంలోని పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆకస్మికంగా పర్యటించారు.
ఆయన వెంటన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ నారాయణ్ గుప్తా ఉన్నారు. అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కళ్యాణ మంటపం నిర్మాణానికి స్థల సేకరణ కోసం వీరు వెళ్లారు. పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఖాళీ భూమిని పరిశీలించారు. ఐతే తన నియోజకవర్గానికి వస్తున్నా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై రోజా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు సమాచారం ఇవ్వకపోగా.. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను తీసుకురావడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ః
కాగా, చిత్తూరులో కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే రోజా మధ్య వివాదం నడుస్తున్నట్లు సమాచారం. అంతేకాదు నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వర్గానికి నారాయణస్వామి అండగా ఉన్నారనే భావనలో రోజా కొద్దిరోజుల నుంచి ఉన్నారు. దీనిపై సీఎం జగన్ దగ్గరే తేల్చుకుంటానని ఆమె గతంలో వ్యాాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణస్వామి పర్యటనతో రోజా ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.