భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల తాకిడికి హిమమయ లద్దాఖ్‌లో వేడి రాజుకుంటోంది.
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమైన వేళ.. అదును చూసి ‘డ్రాగన్’ బుసలు కొడుతోంది. భారత సరిహద్దుల్లో విషం చిమ్ముతోంది.
సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని తరలించింది.
చైనాకు దీటుగా మన సైన్యం కూడా అక్కడ బలగాలను మోహరించింది.
ఇప్పుడు ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎదురెదురుగా నిలబడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అత్యున్నత స్థాయి భేటీ కూడా నిర్వహించారు.
సరిహద్దు వివాదం
భారత్- చైనాల నడుమ సరిహద్దు వివాదం.. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా విస్తరించి ఉంది.
అరుణాచల్ తనదేనని చైనా వాదిస్తోంది.
ఇరు దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది.
ఆ తర్వాత సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకూ అక్కడ శాంతిని కాపాడాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. అందువల్ల గత కొన్ని దశాబ్దాల్లో అక్కడ ఒక్క తూటా కూడా పేలలేదు.
ఎల్‌ఏసీకి సంబంధించి తమ వైఖరికి అనుగుణంగా ఇరుపక్షాలు గస్తీ నిర్వహిస్తుంటాయి.
ఈ క్రమంలో ‘అతిక్రమణల’ ఆరోపణలు వినపడుతుంటాయి.