ScienceAndTech

మద్రాస్ నోకియా ప్లాంట్ మూసివేత

Madras Nokia Plant Closed Due To Corona

తమిళనాడులో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో మహారాష్ట్ర అనంతరం అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 646 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 17,728కి చేరగా వీరిలో ఇప్పటి వరకు 127మంది మృత్యువాతపడ్డారు. తాజాగా శ్రీపెరుంబదూర్‌లో ఉన్న నోకియా ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆ కంపెనీలో మొత్తం 42 మందికి కరోనా వైరస్‌ సోకిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతో ఈ ప్లాంట్‌ గత కొన్నిరోజుల క్రితమే తిరిగి తెరచుకుంది. భారీ సంఖ్యలో కేసులు బయటపడడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టామని సంస్థ ప్రకటించింది. గత కొన్ని రోజుల క్రితం దిల్లీ శివారులో ఉన్న ఒప్పో మొబైల్‌ కంపెనీలో తొమ్మిది మందికి వైరస్‌ సోకడంతో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసింది. లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చిన అనంతరం.. కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తుల్లో వైరస్‌ బయటపడుతుండడం, వాటిని ఎదుర్కోవడం కంపెనీలకు ఒక సవాలుగా మారింది.