Politics

లాక్‌డౌన్ 5.0 ఉంటుందా?

Will there be a lockdown 5.0?

ఈ నెల 31 తో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఇది పూర్తిగా ఎత్తేశారని, ఇక లాక్ డౌన్ అన్న పదమే వినబడదని అనుకుని సంబరాలు జరుపుకుంటే మాత్రం పొరబాటు పడినట్టే ! ప్రధాని మోదీ ఈ నెల 31 న నిర్వహించే తన రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, ఆ సందర్భంగా జూన్ 1 నుంచి విధించే  ‘లాక్ డౌన్ 5.0’ గురించి ప్రకటించే సూచనలున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ స్పిరిట్ ప్రాధాన్యతను ఆయన వివరిస్తూనే.. దేశంలో అనేక చోట్ల ఆంక్షలను ఇంకా సడలించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 70 శాతం నమోదై ఉన్న 11 నగరాల మీద ఐదో దశ లాక్ డౌన్ ఫోకస్ పెట్టే సూచనలున్నాయని తెలిసింది. ఈ లిస్టులో ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, పూణే, థానే, చెన్నై, ఇండోర్, అహమ్మదాబాద్, జైపూర్, కోల్ కతా, సూరత్ సిటీలున్నట్టు హోమ్ శాఖ వర్గాలు చూచాయగా పేర్కొన్నాయి. ఐదో దశ లాక్ డౌన్ లో మత పరమైన కూడళ్లను, ప్రార్థనా మందిరాలను పునఃప్రారంభించేందుకు కొన్ని షరతులపై ప్రభుత్వం అనుమతించవచ్చునని అంటున్నారు. అయితే ఫెస్టివల్స్, భజనలు వంటివాటికి అనుమతించక పోవచ్ఛు.