Politics

ఆంగ్ల మాధ్యమాన్ని ఆపేందుకు కుట్రలు

YS Jagan Slams Plans To Stop English Medium

ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రోజుకో అంశంపై మేధోమథనం నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్‌ బుధవారం విద్యారంగంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, చదువుల్లో మార్పు తీసుకురావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని వివరించారు. ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని సూచించారు. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా సహకారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే పేదరికం నుంచి వారి కుటుంబాలు బయటపడతాయన్నారు. రాష్ట్రంలో 45వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే సరైన సౌకర్యాలు లేవని, అందుకే ‘నాడు-నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశాం. పేరెంట్‌ కమిటీలను అడిగితే 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచిదన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమాన పరిచినట్లా?. పెద్ద పెద్దవాళ్లంతా తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు’’ అని జగన్‌ అన్నారు. అగస్టు 3న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని, అదే రోజు జగనన్న విద్యా కానుక అందిస్తామని తెలిపారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వెబ్‌సైట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పాఠశాలల్లోని వసతులను విద్యార్థులు స్వయంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమస్యలను వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టవచ్చన్నారు. కళాశాలల్లోని వసతులపై పిల్లల తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించేందుకు వెసులుబాటును కల్పించినట్లు చెప్పారు. ఈ మేరకు సరైన వసతులు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవచ్చన్నారు. త్వరలో రాష్ట్ర ఉన్నత విద్యామండలిలోనూ ఇలాంటి వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని సీఎం జగన్‌ వివరించారు.