NRI-NRT

ఇవాంకా…మీ ఆయనకు బుద్ధి లేదా?

Jared Kushner Under Fire For Not Wearing Mask At NASA

2011 తరవాత అమెరికాలో స్పేస్‌ఎక్స్ నిర్వహించ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇంటి నుంచి వీక్షించమని ప్రజలందరికి సూచించినప్పటికీ ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ మిషన్‌ను వీక్షించడానికి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లారు. వారి పర్యటనకు సంబంధించిన చిత్రాలను ఆమె భర్త జేర్డ్ కుష్నర్ ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో ఆయన కనీసం మాస్క్‌ కూడా ధరించలేదు. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వారి కుటుంబానికి కరోనా వైరస్‌ను తట్టుకొనే రోగ నిరోధక శక్తి ఉందా? అని ప్రశ్నించారు. దీని ద్వారా వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మరో నెటిజన్ కామెంట్‌ చేశారు. కరోనా వైరస్‌ సృష్టించిన విలయతాండవానికి ఇప్పటివరకు ఎక్కువ బలైంది అమెరికా దేశ వాసులే. ఆ దేశంలో మరణాల సంఖ్య లక్షమార్కును కూడా దాటేసింది. ఇదిలా ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో లాంచింగ్‌కు 17 నిమిషాల ముందు అంతరిక్ష యాత్రను వాయిదా వేశారు. మే 30, మే 31.. ఈ రెండు తేదీలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మిషన్ ప్రయోగం వాయిదా పడటంతో ఇవాంక ట్విటర్ వేదికగా నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. అయితే అన్నింటికంటే భద్రతే ముఖ్యమని అన్నారు.