* పాన్ నెంబరును క్షణాల్లోనే పొందే ఈ-పాన్ సౌకర్యాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఆధార్ కార్డు నెంబరుతోపాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేని ఈ ఎలక్ట్రానిక్ పాన్ కార్డుకు ఎలాంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆదాయపు పన్నుశాఖ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అయితే ఈ సదుపాయం బీటా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం అధికారికంగా ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* దేశీయ విమానాలు అతి పరిమితంగా తిరుగుతున్న వేళ తన కుటుంబసభ్యుల కోసం ఒక వ్యాపారి ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే భోపాల్‌కు చెందిన ఒక బడా లిక్కర్ వ్యాపారి కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు లాక్‌డౌన్‌కు ముందు దిల్లీనుంచి భోపాల్ వచ్చి అక్కడే ఉండిపోయారు. అయితే ఇటీవలే దేశీయంగా కొన్ని పరిమిత విమాన సర్వీసులకు విమానాయానశాఖ అనుమతి ఇచ్చిన క్రమంలో ఆ వ్యాపారి ఏకంగా 180 సీట్ల ఏ320 విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఆ విమానం గత సోమవారం దిల్లీ నుంచి భోపాల్ విమానాశ్రయానికి కేవలం విమాన సిబ్బందితో మాత్రమే వచ్చి ఆ వ్యాపారవేత్త కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలుతో పాటు పనిమనిషిని ఎక్కించుకుని తిరిగి దిల్లీకి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఎయిర్‌బస్ 320 తరహా విమానాన్ని బుక్ చేసుకోవాలంటే సుమారు రూ. 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపారు.
* తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి.. తితిదే ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు తితిదే ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.
* హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని కూడలి వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. కామినేని ఫ్లైఓవర్ 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో రూ. 43 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనిద్వారా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
* వలసకార్మికులు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా మాట్లాడుతూ..‘వారి బాధను అందరూ చూశారు. వారు ఏడుపులు విన్నారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఇంకా చూసినట్లు లేదు. రానున్న ఆరు నెలల కాలానికి ప్రతి పేద కుటుంబానికి కేంద్రం రూ.7,500 అందించి ఆదుకోవాలి. అలాగే ఇళ్లకు చేరుకోడానికి సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలి’ అని కోరారు.
* హాంకాంగ్ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది.