* వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మదుపరికి ఉపశమనం. దిగువ స్థాయిల్లో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు చెలరేగాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను బలపరిచాయి.బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2.01 లక్షల కోట్లు పెరిగి 123.62 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 30,793.11 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం తడబడిన సూచీ.. ఇంట్రాడేలో 30,525.68 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. తదుపరి కొనుగోళ్ల మద్దతు దూసుకెళ్లిన సూచీ.. ఒకానొకదశలో 31,660.60 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 995.92 పాయింట్ల లాభంతో 31,605.22 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ సైతం 285.90 పాయింట్లు పెరిగి 9,314.95 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 9,004.25- 9,334 పాయింట్ల మధ్య కదలాడింది.
* కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు పెంచుకోవడంపై ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దృష్టి పెట్టింది. వాహన కొనుగోళ్లపై లీజింగ్ సదుపాయం, సులభ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. ఓమ్ని ఛానెల్ మొబిలిటీ సొల్యూషన్స్ కింద కంపెనీ ‘పవర్ లీజ్’ పేరిట సున్నా డౌన్ పేమెంట్ పథకాన్ని ప్రకటించింది. అన్ని ఫోక్స్‌వ్యాగన్ బీఎస్-6 కార్లను ‘పే ఫర్ యూసేజ్’ కింద పొందొచ్చు. తక్కువ అద్దె, బీమా, నిర్వహణ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ సెక్యూర్ పథకంతో వినియోగదారులు తక్కువ డౌన్ పేమెంట్, ఈఎంఐ, 3-4 ఏళ్ల బీమా సౌలభ్యంతో కొత్త వెంటో, టిగువాన్ ఆల్‌స్పేస్ మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు ఆర్థికపరమైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫన్ నాప్ పేర్కొన్నారు. ఫోక్స్‌వ్యాగన్ సెక్యూర్, పవర్‌లీజ్ పథకాలతో వినియోగదారులు సులభంగా కొత్త కారు సొంతం చేసుకోవచ్చని అన్నారు.
* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫ్యూచర్, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండడం ఇందుకు నేపథ్యం. దీంతో నిఫ్టీ మరోసారి 9500 మార్కుకు చేరువైంది.
* జపాన్, ఐరోపా దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తాయన్న వార్తల నేపథ్యంలో గురువారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.53 గంటలకు సెన్సెక్స్ 274.98 పాయింట్లతో 31880 వద్ద కదలాడగా, నిఫ్టీ 79.60 పాయింట్లు పెరిగి 9394 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ఉన్నాయి. యుఫ్లెక్స్, ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్, ఉజ్వన్ ఫైనాన్స్, ఈఐహెచ్ లాభాల్లో ఉండగా.. జేపీ అసోసియేట్స్, హెరిటేజ్ ఫుడ్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, టొరెంట్ ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. నేడు చాలా కంపెనీలకు చెందిన నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో మదుపరులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల్లో టీవీఎస్ మోటార్స్, లుపిన్, ఫెడరల్ బ్యాంక్ వంటి 24 కంపెనీలు ఉన్నాయి.
* వచ్చే కొన్ని నెలల పాటు వినియోగదారులు వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా వేస్తోంది. అయితే ఉద్యోగుల వేతనాల్లో 10-15% కోతల వల్ల రుణాలపై ప్రభావం ఉండదని, కానీ కొంత మార్పులు ఉండొచ్చని తెలిపింది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా కుదేలైన వాహన విక్రయాలు మళ్లీ బలంగా పుంజుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ (రిటైల్ బ్యాంకింగ్) అరవింద్ కపిల్ వెల్లడించారు. భౌతిక దూరం నిబంధనలు, బ్యాంకులు అందిస్తున్న డిజిటల్ రుణాలు ఇందుకు దన్నుగా నిలుస్తాయని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల నిరుద్యోగం రికార్డు గరిష్ఠాలకు చేరగా.. పలు కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం వంటి వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. అయితే 10-15 శాతం వేతనాల కోతల వల్ల రుణాల వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని కపిల్ అన్నారు.
* జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్) కింద కొత్తగా చేరే చందాదారులకు ఖాతా తెరిచేందుకు కాగిత రహిత ఆధార్ ఆధారిత కేవైసీ సరిపోతుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బుధవారం వెల్లడించింది. ఎన్‌పీఎస్ ఖాతాల్ని తెరవడానికి కాబోయే చందాదారుల సమ్మతితో వారి ఆఫ్‌లైన్ ఆధార్‌ను ఉపయోగించడానికి ఇ-ఎన్‌పీఎస్/పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్స్ (పీఓపీ) సౌకర్యాలను పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతించింది. దీంతో 12 అంకెల ఆధార్ సంఖ్య కోసం ఫిజికల్‌గా ఆధార్ పత్రం సమర్పించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఈ కొత్త ప్రక్రియలో దరఖాస్తుదారు యూఐడీఏఐ పోర్టల్‌లోని ఇఎన్‌పీఎస్ ద్వారా పాస్‌వర్డ్ సురక్షిత ఆధార్ ఎక్స్‌ఎమ్‌ఎల్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కేవైసీ కోసం వినియోగించుకోవచ్చని తెలిపింది. పీఓపీల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారు గుర్తింపుతో పాటు చిరునామా ధ్రువీకరణ కూడా పూర్తవుతుందని వివరించింది. కేవైసీ సత్వర ధ్రువీకరణ కారణంగా ఎన్‌పీఎస్ ఖాతా వెంటనే యాక్టివేట్ అవుతుందని, దీంతో దరఖాస్తుదారు వెంటనే తన ఎన్‌పీఎస్ ఖాతాలోకి సొమ్ములు డిపాజిట్ చేసుకోవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది.
* అమెస్టర్‌డామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎటెర్గో బీవీ సంస్థను ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (ఓఈఎం) కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా విద్యుత్తు ద్విచక్ర వాహన విపణిలోకి అడుగుపెట్టేందుకు ఈ లావాదేవీ ఉపయోగపడుతుందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. తమ ఇంజినీరింగ్, డిజైన్ సామర్థ్యం మరింతగా విస్తరించేందుకు కూడా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. ఎటెర్గో బృందం ఆమ్‌స్టర్‌డామ్ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని తెలిపింది. అయితే కొనుగోలు లావాదేవీ విలువెంతో కంపెనీ వెల్లడించలేదు. 2014లో వ్యవస్థాపితమైన ఎటెర్గో.. ‘యాప్ స్కూటర్’ అనే పూర్తిగా విద్యుత్‌తో నడిచే స్కూటర్‌ను తయారుచేసింది.
* భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ కోసం బిడ్లు వేసేందుకు గడువును జులై 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించేందుకు గత నవంబరులో ఆమోదం తెలిపిన మంత్రివర్గం, బిడ్ల కోసం ఈ ఏడాది మార్చి 7న ఆహ్వానించింది. బిడ్లు సమర్పించేందుకు తొలుత మే 2 వరకే గడవు ఇవ్వగా, తదుపరి జూన్ 13 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోమారు ఈ గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
* కరోనా కారణంగా ప్రయాణ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడడంతో 12,000 మందికి పైగా ఉద్యోగులను బోయింగ్ తొలగిస్తోంది. ఈ వారంలో ఇప్పటికే అమెరికాలో 6,770 మంది ఉద్యోగుల్ని తప్పించింది. మరో 5,520 మంది సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తు చేసుకోవాలని కోరనుంది. అమెరికాలో ఏప్రిల్ మధ్యలో విమాన ప్రయాణాలు 96 శాతం మేర తగ్గాయి. ఇపుడు పరిస్థితులు కొద్దిగా మారాయి. మంగళవారం అమెరికా విమానాశ్రయాల్లో 2,64,843 మంది అడుగుపెట్టారని.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 89 శాతం తక్కువ అని ఒక నివేదిక పేర్కొంది. తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు బోయింగ్ గతంలో పేర్కొన్న విషయం విదితమే.
* 10,000కు పైగా సెలూన్లకు సహాయ సహకారాలు కొనసాగించే ప్రణాళికలను గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్‌కు చెందిన కేశ సంరక్షణ బ్రాండ్ గోద్రెజ్ ప్రొఫెషనల్ ప్రకటించింది. సురక్ష సెలూన్ కార్యక్రమం కింద అవసరమైన సలహాలు, సూచనలు, వనరులు అందిస్తామని, భద్రతపై సెలూన్ ఓనర్లకు తాజా సమాచారం ఇస్తామని తెలిపింది. 15,000 లీటర్ల శానిటైజర్లు, 10,000 రీ-యూజబుల్ మాస్కులు, భద్రత- శుభ్రతలపై అవగాహన, వ్యాపారం మళ్లీ గాడిలో పడటానికి తోడ్పాటు అందిస్తామని వెల్లడించింది. లాక్‌డౌన్ వల్ల సెలూన్ పరిశ్రమపై భారీగా ప్రభావం పడిందని, వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ సీఈఓ (భారత్, సార్క్) సునీల్ కటారియా పేర్కొన్నారు.