కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఓ కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. మేరఠ్‌లోని మెడికల్ కళాశాల ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ముగ్గురు కొవిడ్-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళుతుండగా ల్యాబ్ టెక్నీషియన్‌పై కోతుల గుంపు దాడి చేసింది. అతడి చేతిలో ఉన్న శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. వాటిని కోతులు తమ వెంటే పట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గుంపులోని ఓ కోతి శాంపిళ్లను నోటితో పీల్చడం కనిపించింది. దీంతో కోతులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఆ శాంపిళ్లను కోతులు పట్టుకెళ్లడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్ కళాశాల సూపరింటిండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యన్ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.