Politics

తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ

Nimmagadda Ramesh Kumar Returns As AP SEC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన విషయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు స్పందించారు. ఈ క్షణం నుంచే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని చెప్పారు. ఎన్నికల అధికారికగా ఇకపై కనగరాజ్‌ కొనసాగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ రద్దయిన నేపథ్యంలో నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నట్లేనని ఆయన చెప్పారు. ఇకపై అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని న్యాయవాది ప్రసాద్ బాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయని, ఇకపై ఆయినా తీరు మార్చుకుని తదుపరి నాలుగేళ్లు సమర్థవంతంగా పాలన అందించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాలను సంబంధించి ఇదో చారిత్రక తీర్పని న్యాయవాదులు అంటున్నారు. రమేశ్ కుమార్ కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని ఆయన చెప్పారు.వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను మళ్లీ పదవిలోకి వచ్చానని ప్రకటించారు. తాను ఇకపై కూడా గతంలో మాదిరిగానే నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాననీ, పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.