DailyDose

జగన్‌కు షా ఫోను-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Amith Shah Calls YS Jagan

* ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌. కోవిడ్‌ – నివారణా చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం.

* ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూశారు. ఆయన మరణవార్తను అజిత్‌ జోగి తనయుడు అమిత్‌ జోగి ట్విటర్‌లో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్‌ జోగి వయస్సు 74 ఏళ్లు. కొన్నాళ్లుగా రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. 1946 ఏప్రిల్‌ 29న బిలాస్‌పూర్‌లో జన్మించిన అజిత్‌ జోగి.. భోపాల్‌ మౌలానా అజాద్‌ కళాశాలలో విద్యనభ్యసించారు.

* తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపి కబురు చెబుతానని.. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొండపోచమ్మ జలాశయం వద్ద మర్కూక్‌ పంప్‌హౌస్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తులో ఇదొక ఉజ్వలమైన ఘట్టంగా కేసీఆర్‌ అభివర్ణించారు. ‘‘యావత్ ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు కాళేశ్వరం. కొండపొచమ్మసాగర్‌ జలాశయం కాళేశ్వరంలో పదో లిఫ్ట్‌ ప్రాజెక్టు. మల్లన్న సాగర్‌ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు. తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమే ఈ ప్రాజెక్టులు’’ అని కేసీఆర్‌ తెలిపారు.

* న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్‌ ప్రభాకర్‌ సహా 44 మందికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.

* దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్‌ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై మోదీతో చర్చించినట్లు సమాచారం. నిన్న రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్‌ షా లాక్‌డౌన్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జరిగిన ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

* భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తాజాగా ఎలాంటి సంభాషణ చోటుచేసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు వెల్లడించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల విషయంలో ఏప్రిల్ నాలుగున ఇరువురు నేతలు చివరిసారిగా మాట్లాడుకున్నారని చెప్పారు. సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోదీతో మాట్లాడానని, చైనా తీరుపై మోదీ అసంతృప్తితో ఉన్నారని ట్రంప్‌ చెప్పుకోవడం గమనార్హం.

* ‘మినియాపోలీస్‌ ఘటన’ అమెరికాలో ఉద్రిక్తతలకు దారితీసింది. జాతివిద్వేషంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయని పలు చోట్ల ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు అదుపు తప్పి హింసాత్మక ఘటనలకు దారితీశాయి. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10.30 సమయంలో అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు వేసిన కంచెను దాటుకొని వచ్చి భవనంలోకి చొరబడి అక్కడి ఫర్నిచర్‌కు నిప్పంటించారు.

* దిల్లీ నుంచి రాకపోకల్ని నిలిపివేయాలన్న హరియాణా ప్రభుత్వ నిర్ణయంతో శుక్రవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీ-గురుగ్రామ్‌ జాతీయ రహదారిపై భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం హోంమంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దిల్లీ నుంచి ప్రజలు భారీగా హరియాణాలోకి వస్తున్నారని.. దీనివల్లే కేసులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

* పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు తీసిన బాంబుదాడి ఘటన జరిగి ఏడాది దాటగానే అటువంటి దాడికే మరోమారు ఉగ్రవాదులు ప్రణాళిక రచించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. చివరి నిమిషంలో భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై ఇప్పటికే భారత్‌-పాక్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కానీ, మారుతున్న పరిస్థితులు భద్రతా దళాలకు మరిన్ని సవాళ్లను విసురుతున్నాయి. ఇటువంటి శైలి దాడులు ఇరాక్‌, సిరియా వంటి చోట్ల జరుగుతుంటాయి.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న నటి మంచు లక్ష్మి తన పెళ్లి ఆల్బమ్‌ను తిరగేశారు. పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్‌స్టా‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి రోజున చాలా కంగారుపడ్డానని పేర్కొన్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంట బిడియంగా అనిపించిందని, బయటికి వెళ్లే దారి కోసం సీరియస్‌గా వెతికానని అన్నారు.