DailyDose

దూసుకెళ్లిన వోడాఫోన్-ఐడియా షేర్లు-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Vodafone Idea Shares Spike

* దేశీయ స్టాక్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా షేర్లు నేడు భారీ లాభాల్లో ట్రేడువుతన్నాయి. ఒక దశలో ఇవి 35శాతం లాభపడ్డాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ ఈసంస్థలో 5శాతం వాటాను కొనుగోలు చేయనుందని ఆంగ్ల పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో కథనం వెలువడటంతో షేర్లు ర్యాలీ చేశాయి. కొనుగోళ్ల ఒత్తిడి పెరిగి షేర్లు 34.87శాతం లాభపడి రూ.7.85 వద్దకు చేరింది. గత నెలరోజుల్లో షేరు విలువ 80శాతం పెరిగింది.

* దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ తొలుత ఊగిసలాడింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 200 పాయింట్ల మేర లాభాల్లోకి దూసుకెళ్లింది.

* భారతదేశానికి చెందిన పేమెంట్స్ యాప్‌ మొబిక్విక్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆరోగ్యసేతుకు సంబంధించిన ప్రకటనలు మొబిక్విక్‌లో కనిపించడమే గూగుల్‌ నిర్ణయానికి కారణం. అయితే ఆ లింక్‌ను తొలగించమని గూగుల్ గతంలోనే ఆ యాప్‌కు సూచించింది. కానీ, గురువారం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సదరు యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం గూగుల్, మొబిక్విక్‌ బృందాలు ఈ అంశంపై మాట్లాడి పరిష్కరించుకున్నాయి. ఆ తరవాత ఆ యాప్‌ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది.

* కొన్ని నిబంధనలు పాటించడంలో అలసత్వం వహించినందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై రూ.5 కోట్లు, కర్ణాటక బ్యాంకుపై రూ.1.2 కోట్ల జరిమానాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విధించింది. నిరర్థక ఆస్తులకు సంబంధించిన కేటాయింపులపై ఈ ఆదేశాలు ఇచ్చింది.

* కరోనా సంక్షోభం నేపథ్యంలో, 270 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సంస్థ బుక్‌మైషో ప్రకటించింది. అంతర్జాతీయంగా ఉన్న 1450 మంది ఉద్యోగుల్లో వేర్వేరు విభాగాలు, బృందాల నుంచి 270 మందిని తొలగిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆశిష్‌ హేమరజని తెలిపారు. నాయకత్వ స్థానాల్లోని పలువురు 10-50 శాతం వేతన కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వివరించారు.

* వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులు విక్రయించే ఆమ్‌వేతో ఐటీసీ చేతులు కలిపింది. ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే, రోగనిరోధకశక్తిని పెంపొందించే ఉత్పత్తులను సంయుక్తంగా పంపిణీ చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ‘బి నాచురల్‌+’ పళ్ల రసాలను ఆవిష్కరించిన ఐటీసీ, వీటిని ఆమ్‌వే మాత్రమే పరిమితకాలం పాటు విక్రయిస్తుందని తెలిపింది. ఇలాంటి అనేక ఉత్పత్తులు త్వరలో ఆవిష్కరిస్తామని ఐటీసీ వివరించింది.

* ఐరోపా చౌకధరల విమానయాన సంస్థ ఈజీ జెట్‌ తన 15,000 మంది సిబ్బందిలో మూడోవంతు (సుమారు 5,000) మందిని తొలగిస్తామని ప్రకటించింది. కొవిడ్‌-19 సంక్షోభం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని తెలిపింది. జూన్‌ 15న సర్వీసులు పరిమితంగా ప్రారంభిస్తామని, అయితే కొవిడ్‌ ముందటి డిమాండ్‌ వచ్చేందుకు మూడేళ్లు పడుతుందని భావిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే సెప్టెంబరుకు విమానాల సంఖ్యను 51 తగ్గించి, 302 చేయాలన్న ప్రణాళికలో సంస్థ ఉంది.