Editorials

ట్రంప్…మీ వేలు మాకొద్దు

China warns Trump and his mediation services

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తోసిపుచ్చింది. ఈ అంశంపై ఇరుదేశాలు మాట్లాడుకుంటాయని తేల్చిచెప్పింది. సరిహద్దు వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని, ఆ విషయాన్ని ఇప్పటికే ఇరు దేశాలకు తెలియజేశానంటూ బుధవారం ట్రంప్‌ ట్వీట్ చేశారు. అయితే భారత్ ఇప్పటికే ఆ ప్రతిపాదనను తిరస్కరించగా..చైనా మొదటిసారి స్పందించింది.

తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ..‘ఇరు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత వ్యవస్థ, చర్చలకు అనువైన విభాగాలు ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించుకోగల సత్తా మాకు ఉంది. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు’ అని కరాఖండిగా తేల్చిచెప్పారు. కొద్ది రోజులు కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్, సిక్కింలో భారత్, చైనా సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగారు. ఆ ఘటనలో అనేక మంది జవాన్లు గాయపడ్డారు. దాంతో సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో..రెండు దేశాలు సైనికులను భారీగా మోహరించాయి.