కరోనా మహమ్మారి కరాళనృత్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య నూతన గరిష్ఠ శిఖరాలను తాకుతోంది. శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య 60.94 లక్షలు దాటింది. ఇక ఈ వ్యాధికి బలైన వారి సంఖ్య 3,68,806కు చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటిపోయింది. వైరస్ బారినపడి 1.05 లక్షల మందికిపైగా మరణించారు. ఒక్క శనివారమే 12 వేలకుపైగా కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్పారు.
* అమెరికాలో కొవిడ్-19కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ నగరంలో జూన్ ఎనిమిదో తేదీ నుంచి దశల వారీగా వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు గవర్నర్ ఆండ్రూ కౌమో తెలిపారు.
* లాటిన్ అమెరికాకు చెందిన బ్రెజిల్‌లో తాజాగా 24 గంటల వ్యవధిలో 1,100 మందికిపైగా కొవిడ్-19 కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 28 వేలు దాటింది. 4.69 లక్షలకుపైగా కేసులతో ప్రపంచవ్యాప్తంలోనే బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది.
* రష్యాలో శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో 8,900కుపైగా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు 3.96 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారని, 4,500 మందికిపైగా మరణించారని అధికారులు ప్రకటించారు.
* చైనాలో తాజాగా 24 గంటల వ్యవధిలో ఆరు కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశం జర్మనీ వెళ్లిపోయిన 400 మంది మేనేజర్లు, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తిరిగి చైనాకు చేరుకుంటున్నారు.
* దక్షిణ కొరియాలో శనివారం కొత్తగా 39 మంది కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది.
* సింగపుర్‌లో శనివారం 506 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు అక్కడ 34,366 మంది కరోనా బారిన పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
* బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో 215 మంది కొవిడ్-19 కారణంగా మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
20లక్షల దిశగా అమెరికా కరోనా కేసులు
Related tags :