అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి అంచలంచలుగా సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజ్రుంభించి నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన కృష్ణ. సెల్యులాయిడ్ కర్షకుడు. ఈ మేరునగధీరుడు మే 31న పుట్టిన రోజు.
ఈ బుర్రిపాలెం బుల్లోడు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిసారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో ‘ఛైర్మన్’ వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ తనయుడు ఆనందబాబుని కలవమని అతని మామ ఇచ్చిన సలహాతో మద్రాసులో కృష్ణ అతనిని కలిసారు. ప్రసాద్ అప్పుడే ‘కొడుకులు – కోడళ్ళు’ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణని ఆ సినిమాలో ఒక పాత్రకు ఎంపికజేసి, కొంత రిహార్సల్సు కూడా నిర్వహించారు. కారణాంతరాల వలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభన్‌బాబుతో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు కూడా. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో కృష్ణ చిన్నపాత్ర పోషించారు. ఒకసారి కొడవటిగంటి కుటుంబరావుతో పాండీ బజార్లో వున్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో వున్న దర్శకనిర్మాత శ్రీధర్ చూసి, ‘కాదలిక్కనేరమిల్లై’ (తెలుగులో ‘ప్రేమించిచూడు’)లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకుంటే, తమిళ భాష రాని కృష్ణకు ఆ అవకాశం చేజారి రవిచంద్రన్‌కి దక్కింది. తర్వాత కృష్ణ ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. తెనాలి తిరగి వెళ్లాక, 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని కూడా తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చినా వారెవరూ ఎంపిక కాలేదు. కృష్ణ అదృష్టవంతుడని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చెయడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం ‘తేనెమనసులు’ కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ఈ సినిమాలో కృష్ణ సరసన సుకన్య, రామ్మోహన్ సరసన సంధ్యారాణి నటించగా, 31 మార్చి 1965న సినిమా విడుదలై వంద రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణకి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది. తెనాలి వెళ్లిపోయారు. ఈ లోగా ఆదుర్తి కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం కృష్ణతో ‘కన్నెమనసులు’ ప్రారంభమైంది. అదే టైమ్‌లో బాండ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ డూండేశ్వరరావు ‘గూఢచారి116’ సినిమా కోసం కృష్ణకు ఆఫర్ ఇస్తూ ఆదుర్తిని సంప్రదించారు. ఆదుర్తి దీవెనలతో ఆ యాక్షన్ చిత్ర అగ్రిమెంటుపై కృష్ణ సంతకం పెట్టి నటించారు. ‘కన్నెమనసులు’ జులై 22, 1966న విడుదలైతే, ‘గూఢచారి116’ ఆగస్టు 11, 1966న విడుదలై, తొలి స్పై పిక్చర్ కావడంతో దుమ్ము రేపింది. ‘కన్నెమనసులు’ యావరేజిగా ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణ డూండీతో 25 సినిమాల దాకా చేశారు. ‘తేనెమనసులు’ చిత్రానికి కృష్ణ అందుకున్న తొలి పారితోషికం రెండు వేలు. ‘గూఢచారి116’ తర్వాత కృష్ణని అందరూ ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’ అని పిలవటం మొదలెట్టారు. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాల్లో బుక్ అయ్యారు.
చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్‌డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజ్‌ని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. ‘మరపురాని కథ’ చిత్రంతో దర్శకుడు వి.రామచంద్రరావుతో కృష్ణకు మంచి స్నేహం ఏర్పడింది. ఆల్ టైం గ్రేట్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ దాకా రామచంద్రరావు, కృష్ణతో మొత్తం 13 చిత్రాలకు పనిచేశారు. వీటిలో ‘అసాధ్యుడు’, ‘నేనంటే నేనే’, ‘కర్పూర హారతి’, ‘అఖండుడు’, ‘మా మంచి అక్కయ్య’, ‘పెళ్లికూతురు’, ‘గంగ-మంగ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి.