* చెన్నై ప్లాంటులో మే 8న ఉత్పత్తిని పునఃప్రారంభించాక 5000కి పైగా కార్లను ఎగుమతి చేశామని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ‘పరిస్థితులు సాధారణ స్థితికి మార్చేందుకు మరోమారు మా ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాం. ప్రభుత్వం తలపెట్టిన ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని వేగవంతం చేసేందుకు తాము ఎంతలా కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమ’ని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు.
* మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు వాహనాలపై విపరీతమైన మక్కువ. ఆయన ఈ విషయాన్ని ఎప్పుడూ దాచుకోరు. ఇటీవల మహీంద్రాలో తయారైన తేలికపాటి సాయుధ వాహనం (ఏఎల్‌ఎస్‌వీ) పనితీరును సైన్యం పరీక్షిస్తోంది. ఈ వాహనాన్ని మహీంద్రా ఎమిరేట్స్ వెహికల్ ఆర్మురింగ్ సంస్థ తయారు చేస్తోంది. మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ఎంఈవీఈ) పై వచ్చిన ఒక ఆర్టికల్‌ను ఆయన పోస్టు చేశారు. మా రక్షణ విభాగం బృందం ఎంఅండ్‌ఎం అర్థాన్ని ‘మీన్ మీషిన్’ (ప్రామాణిక యంత్రం)గా మార్చేశారు. వారి అత్యుత్తమ ప్రమాణాలకు ఇదొక చిహ్నం’ అని ట్వీట్ చేశారు.
* కరోనా వైరస్, లాక్‌డౌన్ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారెంట్, ఉచిత సర్వీసింగ్‌ల గడువును జూన్ 30వ తేదీ వరకు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వారెంట్, ఉచిత సర్వీసింగ్‌లకు సంబంధించి మే నెలతో గడువు తీరిపోయిన వాళ్లకు మరో నెల అవకాశాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
* ట్రేడింగ్ మెంబర్స్‌కు లేదా క్లియరింగ్ సంస్థలకు క్లయింట్లు సమర్పించాల్సిన పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన నిబంధనల అమలును 2020 ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించినట్లు సెబీ తెలిపింది. పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేయకుండా నియంత్రించే ఉద్దేశంతో ఈ నిబంధనలను రూపొందించింది. వాస్తవానికి జూన్ 1 నుంచే ఇవి అమల్లోకి రావాల్సి ఉండగా ఆగస్టు 1వ తేదీకి పొడిగించింది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టరు పదవి కోసం అశ్వినీ భాటియా పేరును బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సిఫారసు చేసింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా ఎం.వి.రావు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఎండీగా పి.పి.సేన్‌గుప్తా పేర్లను సూచించింది. అశ్వినీ భాటియా, పి.పి.సేన్ గుప్తా ప్రస్తుతం ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో పనిచేస్తుండగా, ఎం.వి.రావు కెనరా బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు.