Movies

అందమైన చిరునవ్వుకు అర్థం…మార్లిన్ మన్రో!

Remembering Marilyn Monroe On Her Birthday

రవి వర్మకే అందని ఒకే ఒక అందినివో అని సినీ కవీంద్రుడు ఓ అమ్మాయి గురించి వర్ణించిన పాట తెలియనివారు వుండక పోవచ్చు. ఈ వర్ణణకు నిజమైన అర్థం ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.

ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్వింది. ఏడిస్తే ఏడ్చింది! కొంటె చూపు చూస్తే మెలికలు తిరిగి సిగ్గుపడింది!! మార్లిన్ మన్రో… పేరుకు అర్థం తెలుసా? ‘వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ’

అందమంతా ముద్ద చేసి ఆకర్షణ అద్దితే… అది ఆమె! తళుకులీనే కళ్లు, జిగేల్మనే నవ్వు జోడిస్తే …అది ఆమె!
ఉంగరాల జుత్తు, ఆకట్టుకునే రూపం సమకూరిస్తే… అది ఆమె!
చలాకీతనం, ఉత్సాహం కలగలిపితే… అది ఆమె!
అందుకే ఆమె… మోడల్‌గా మెరిసింది. వెండితెరపై వెలిగింది. అభిమానుల గుండెల్లో అందాల శృంగార తారగా మరిచిపోలేని ముద్ర వేసింది.
ఆమె… మార్లిన్‌ మాన్రో! నటిగా, మోడల్‌గా, గాయనిగా ఆమె ఏం చేసినా… అభిమానులు ఊగిపోయారు. ఉర్రూతలూగారు. వెర్రెత్తిపోయారు. ‘బ్లాండ్‌ బాండ్‌షెల్‌’, ‘సెక్స్‌ సింబల్‌’ లాంటి అనేక బిరుదులతో పిలుచుకుని మురిసిపోయారు.
కానీ… ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంత పేరు, డబ్బు సంపాదించిన ఆమె… కేవలం 36 ఏళ్ల వయసుకే అనూహ్యంగా మరణించడం ఓ విషాదం! మార్లిన్‌ మాన్రో అంటే ఏమిటో తెలియాలంటే ఆమె సినిమాలను కాదు చూడాల్సింది… ఆమె జీవితాన్ని!

లాస్‌ఏంజెలిస్‌లో 1926 జూన్‌ 1న పుట్టిన మార్రిన్‌మాన్రో అత్యధిక పారితోషికం అందుకున్న అందాల తారగా పదేళ్ల పాటు వెండితెరనే ఏలనా… ఆమె బాల్యం మాత్రం కడగండ్ల మయం. తండ్రెవరో తెలియదు. చిన్నప్పుడే అమ్మని వదిలేశాడు. ఇక అమ్మకి ఆర్థిక స్తోమత లేదు. దాంతో బాల్యంలో ఆ అందాల తార జీవితం అనాధాశ్రమాలకీ, పరాయి పంచలకి పరిమితమైంది. ఏడేళ్ల వయసులో అమ్మ అక్కున చేర్చుకున్నా అది కొన్నేళ్లే. అమ్మ అనారోగ్యంతో పరిస్థితులు ఆమెను మళ్లీ శరణాలయాల పాలు చేశాయి. ఈ నేపథ్యంలో సిగ్గరిగా, ఆత్మన్యూనతతో ఉండే మార్లిన్‌మాన్రోకి అందమైన రూపమే వరమైంది. మోడలింగ్‌ రంగం ఎర్రతివాచీ పరిచింది. స్థిరత్వం కోసం పదహారేళ్లకే తనకన్నా తొమ్మిదేళ్లు పెద్దయిన వ్యక్తిని తొలి వివాహం చేసుకుంది. మోడలింగ్‌ వల్ల ఆమె అందం ఇనుమడిస్తే, ఆత్మవిశ్వాసం మొగ్గతొడిగింది. మోడలింగ్‌ తర్వాత సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. కొన్ని చిన్న చిన్న వేషాల తర్వాత స్టార్‌డమ్‌ వచ్చి పడింది. ఆమె సినిమాలు అప్పట్లోనే 200 మిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి. ఇది ఇప్పటి లెక్కలతో పోలిస్తే 2 బిలియన్‌ డాలర్లకు పైమాటే.

‘ప్లేబోయ్‌’ పత్రిక మొదటి పత్రికకకు మోడలింగ్‌ చేసి సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీని ఉద్దేశిస్తూ ఆమె పాడిన ‘హ్యాపీ బర్త్‌డే మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ గీతం ఎనలేని ప్రజాదరణ పొందింది. ‘యాజ్‌ యంగ్‌ యాజ్‌ యు ఫీల్‌’, ‘మంకీ బిజినెస్‌’, ‘క్లాష్‌ బై నైట్‌’, ‘డోన్ట్‌ బాదర్‌ టు నాక్‌’, ‘హౌటు మ్యారీ ఎ మిలియనీర్‌’, ‘సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్‌’ ‘ద ప్రిన్స్‌ అండ్‌ ద షో గర్ల్‌’, ‘సమ్‌ లైకిట్‌ హాట్‌’, ‘ద మిస్‌ఫిట్స్‌’ లాంటి చిత్రాలు ఆమంటే విపరీతమైన క్రేజ్‌ను సృష్టించాయి. ‘సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్‌’లో గాలికి గౌను ఎగిరిపోతుంటే సర్దుకుంటున్న మాన్రో ఫోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ భంగిమలో ఆమె విగ్రహాన్ని కూడా నెలకొల్పడం విశేసం. ఒక దశలో పత్రికలకు పూర్తి నగ్నంగా ఫోజులిచ్చిందనే వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఉత్తమ నటిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా అందుకుంది. అయితే మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల పాలైంది. కుంగుబాటుతనంలో బాధపడింది. పదహారేళ్లకే మొదటిసారిగా పెళ్లి చేసుకున్న ఈమె తన 27 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంది. ముఫ్పై ఏళ్ల వయసులో మూడో సారి పెళ్లి చేసుకుంది. ఈమె తన 36 ఏళ్ల వయసులో 1962 ఆగస్టు 5న అనూహ్యంగా మరణించింది. ఇంట్లోని మంచంపై నగ్నంగా, ఒక చేత్తో ఫోన్‌తో బోర్లా పడుకుని ఉండగా కనుగొన్న ఆమె మరణం వెనుక ఎన్నో కథనాలు వచ్చాయి. ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు ప్రకటించినా, నివృత్తి కాని అనేక అనుమానాలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.