DailyDose

పటాపంచలు అయిన మారుతీ అమ్మకాలు-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Maruti Sales Drop 87 Percent

* కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఏప్రిల్‌లో ఒక్క వాహనం కూడా విక్రయించని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో తిరిగి అమ్మకాలను ప్రారంభించింది. గత నెలలో మొత్తం 18,539 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. 2019, మే నెలతో పోలిస్తే అమ్మకాల్లో 86.23 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపింది. దేశీయంగా 13,888 యూనిట్లతో 88.93 శాతానికి విక్రయాలు కుచించుకుపోయినట్లు పేర్కొంది. ఇక విదేశాలకు 4,651 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 48.82 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది.

* దేశంలోని మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర సిలిండర్‌ ధరలు పెరిగాయి. గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న సిలిండర్‌ ధరలు ఈసారి పెరిగాయి. దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయదారు ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ సిలిండర్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

* అమ్మా, నాన్నా, పిల్లలు కలిసి మాల్‌కు వెళ్లడం.. ఏసీ సూపర్‌మార్కెట్లో అవసరం ఉన్నవీ, లేనివీ కొనుగోలు చేయడం.. అక్కడే హోటల్‌లో భోంచేసి ఇంటికి రావడం.. ఇదీ కొవిడ్‌-19కు ముందు పట్టణాలు, నగరాల్లో సరకుల కొనుగోలు తీరు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో ఇదంతా మారిపోయింది..
అధిక శాతం మంది వినియోగదార్లు దూర ప్రాంతాలకు వెళ్లి సరకులు కొనుగోలు చేయడం కంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణాలవైపే మొగ్గు చూపుతున్నట్లు డెలాయిట్‌ సర్వే వెల్లడించింది. ‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ ది కన్జూమర్‌ ట్రాకర్‌’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఇ-మెయిల్‌ ద్వారా అందించిన ప్రశ్నావళికి 18 ఏళ్లు నిండిన సుమారు 1,000 మంది స్పందించారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌ వంటి 13 దేశాల్లో ఇలాంటి సర్వేనే డెలాయిట్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ 19 నుంచి మే 16 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ నుంచి వచ్చిన స్పందనలు ఇలా ఉన్నాయి.
* చాలా మంది వినియోగదార్లు ఇళ్లలో సరకులు నిల్వ ఉంచుకోడానికి ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉండే కిరాణా దుకాణాల నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొనేందుకే ఇష్టపడుతున్నారు.
* గత 6 వారాల్లో వ్యయ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని 55 శాతం మంది వినియోగదార్లు వెల్లడించారు. కిరాణా వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నామన్నారు. రోజు వారీ ఇంటి సామాన్లపై ఖర్చు చేస్తామని 52 శాతం మంది తెలిపారు.
* లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా దుకాణాలే సరకులు అందించాయి. మనకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటున్నందున, అక్కడే కొంటామని 72 శాతం మంది వెల్లడించారు.
* సంక్షోభం సమయంలో బాగా స్పందించిన బ్రాండ్లను కొనుగోలు చేస్తామని 64 శాతం మంది పేర్కొన్నారు.

* ఒక్కో వాహనం విక్రయించడానికి డీలర్లు సదరు వాహన సంస్థ నుంచి మార్జిన్‌ (లాభం) తీసుకుంటారు. కరోనా వైరస్‌ మహమ్మారికి తోడు రెండేళ్లుగా వాహన అమ్మకాలు తక్కువగా జరుగుతున్నందున, వ్యాపార పరిమాణం క్షీణించి, ఇబ్బందులు పడుతున్నామని వాహన డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒక్కో వాహనంపై కనీసం 7% వరకు మార్జిన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాపారాలు మనుగడ సాగించాలంటే, డీలర్ల వ్యయాలు కనీసం 20 శాతం తగ్గేలా చూడాలని వాహన కంపెనీలను వాహన డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఫాదా) కోరుతోంది. అధిక వ్యయాలతో లాభదాయకత క్షీణిస్తుండటం, తక్కువ నిర్వహణ మార్జిన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డీలర్లకు సత్వరమే సాయం అందించాలంటూ భారత వాహన తయారీదార్ల సంఘానికి (సియామ్‌) ఫాదా ప్రెసిడెంట్‌ ఆశీష్‌ హర్షరాజ్‌ కాలే లేఖ రాశారు. ‘ఉద్యోగుల ఖర్చులు, రుణాలపై చెల్లించాల్సిన వడ్డీలు, అద్దెలు పెరుగుతున్నాయి. విక్రయ పరిమాణం, డీలర్‌ మార్జిన్లు మాత్రం పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లేవు. వాహన డీలర్లు కేవలం 3-5 శాతం మార్జిన్లకే విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మొత్తం టర్నోవరులో 0.5-1% నికర లాభానికే వారు వ్యాపారాలను కొనసాగిస్తున్నార’ని లేఖలో వివరించారు.

* సీనియర్‌ నాయకత్వ బృందం వేతనాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. వార్షిక పారితోషికంలో మూడో వంతు వాటాను ‘వేరియబుల్‌ పే’ విభాగానికి మార్చినట్లు తెలిపింది. 2020-21లో నాయకత్వ బృందానికి ఈ 30 శాతం వాటా మార్పు వర్తిస్తుందని వెల్లడించింది. అయితే నాయకత్వ బృందంలోని సభ్యుల వివరాలను తెలియజేయలేదు. సంస్థ విజయాలు లేదా ఏమైనా ఘనతలు సాధించినపుడు ఉద్యోగులకు ఇచ్చే మొత్తాన్ని వేరియబుల్‌ పేలో ఉంచుతారు. కరోనా వైరస్‌ కారణంగా ఉద్యోగుల తొలగింపు భయాలు పెరిగిన నేపథ్యంలో, యెస్‌ బ్యాంక్‌ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే ఏడాదికి రూ.25 లక్షల వార్షిక వేతనం ఉన్న ఉద్యోగులకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కోతలను ప్రకటించిన విషయం తెలిసిందే.

* బ్రిటన్‌లో వ్యూహ నిపుణుడిగా భారత సంతతి వ్యక్తి చిరా బారువాను హెచ్‌ఎస్‌బీసీ నియమించింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితుల నుంచి బ్యాంక్‌ను వృద్ధి బాట పట్టించడానికి హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్‌ హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీగా బారువా చేరారు. వచ్చే 5-10 ఏళ్లలో ఏ దేశాల్లో, ఏఏ ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌బీసీ దృష్టి పెట్టాలో బారువా మదింపు చేయనున్నారు. అధిక రాబడుల కోసం ఆసియాలో హెచ్‌ఎస్‌బీసీ మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బారువా ఇంతకు ముందు మెకిన్సే అండ్‌ కోలో పార్ట్‌నర్‌గా, అలయన్స్‌-బెర్న్‌స్టీన్‌లో విశ్లేషకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం బ్యాంక్‌కు 64 దేశాల్లో 2,35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొంతకాలంగా హెచ్‌ఎస్‌బీసీ రాబడుల కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.