NRI-NRT

భారతీయ దుకాణాలపై లూటీల ప్రభావం

Indian and Telugu businesses looted during george floyd protests in USA

కరోనా కారణంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమెరికాలోని ప్రవాస భారతీయులు.. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతం అనంతరం తలెత్తిన నిరసనలు, విధ్వంసం, లూటీలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అల్లర్లలో మన దేశానికి చెందిన అనేకమంది దుకాణాలు, రెస్టారెంట్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే కరోనా కారణంగా అంతంతమాత్రంగా ఉన్న వ్యాపారాలు.. ఈ దెబ్బతో దివాళా తీసే పరిస్థితి తలెత్తిందని పలువురు ఎన్నారైలు వాపోతున్నారు. మినియాపోలిస్‌లో భారతీయులకు చెందిన దుకాణాలు గణనీయ సంఖ్యలో ఉన్నాయి.

ఇప్పటివరకు అక్కడ సుమారు 308 దుకాణాలు, రెస్టారెంట్లు విధ్వంసానికి గురయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. గాంధీ మహల్‌ రెస్టారెంట్‌, హండీ రెస్టారెంట్‌, ఇంటర్నేషనల్‌ బజార్‌, అనన్య డ్యాన్స్‌ థియేటర్‌ లాంటి ఎన్నారైలకు చెందిన దుకాణాలు ఇందులో ఉన్నాయి. వీటిల్లో తెలుగువారికి సంబంధించినవి లేవని స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు తెలిపారు. వరంగల్‌కు చెందిన ప్రణీత ఒక ఫొటోను ఫేస్‌బుక్‌లో జతచేస్తూ.. తనతోపాటు కాలేజీలో చదువుకున్న స్నేహితురాలి కుటుంబానికి మినియాపోలిస్‌లో ఉన్న కార్ల షోరూం ఈ నిరసనల్లో పూర్తిగా కాలిపోయిందన్నారు.